అంగట్లో పోస్టులు?

అంగట్లో పోస్టులు? - Sakshi


సాక్షి ప్రతినిధి, విజయనగరం : అంగన్‌వాడీ పోస్టులను అమ్ముకుంటున్నారా? లేక తమ పార్టీకి చెందిన వారికే కట్టబెట్టేటట్టు అధికార పార్టీ నాయకులు ముందస్తు ప్రణాళికలు రచించుకున్నారా? అంటే అవుననే  కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. జిల్లాలోని అంగన్‌వాడీ పోస్టుల ఇంటర్వ్యూలు నిర్వహించిన తీరు అనుమానాలకు తావిస్తోంది.  కొంతమందిని ఇంటర్వ్యూలకు పిలవకపోవడం, పిలిచిన వారికి కూడా ఇంటర్వ్యూలు చేయకుండా పంపేయడం వంటి సంఘటనలతో బాధిత  మహిళలు ఆక్రోశిస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు కూడా ఇంట ర్వ్యూ నిర్వహణలో పాలుపంచుకోవడం ఎంత వరకూ సబబని వారు ప్రశ్నిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు ఈ మేరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అక్రమంగా పోస్టులను కట్టబెడుతున్నారని అధికసంఖ్యలో ఫిర్యాదు చేశారు. మీకు నచ్చిన వారికి పోస్టులు కట్టబెట్టినప్పుడు..  మమ్మల్ని ఇంటర్వ్యూలకు పిలవడం ఎందుకని నేతలనుద్దేశించి అధికారులను బహిరంగంగా ప్రశ్నించారు. మహిళల ఆరోపణలు, జరిగిన సంఘటనలు  చూస్తే ఇంటర్వ్యూలన్నీ ముందస్తు ప్రణాళికతో జరిగినట్టు స్పష్టమవుతోంది.  ఈ క్రింది ఉదాహరణలు చూస్తే అవి నిజమని చెప్పక తప్పదు.

 

 కొత్తవలస మండలం ఉత్తరాపల్లి మధుర గ్రామమైన గాంధీ నగరం అంగన్‌వాడీ సెంటర్ కార్యకర్త పోస్టు కోసం తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలలో  ముగ్గురికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి,  మిగిలిన వారిని వెళ్లిపొమన్నారని పోస్టుకు దరఖాస్తు చేసుకున్న గ్రామానికి చెందిన మరడాన నాగమణి అనే మహిళ ఆరోపించారు. మమ్మల్ని అన్యాయం గా ఉదయం నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు కార్యాలయం వద్ద ఉంచేశారని ఆవేదన చెందారు. తీరా సాయంత్రం అయ్యేసరికి ఇళ్ల కు తిరిగి వెళ్లిపోమన్నారని వాపోయారు. చం టిపిల్లల తల్లులు, గర్భిణులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి  కోటి ఆశలతో ఇంటర్వ్యూలకు వస్తే కనీసం  ఇంటర్వ్యూ కూడా నిర్వహిం చపోవడం  దారుణమన్నారు.  

 

 పాచిపెంట మండలం కందిరివలసకు చెం దిన పిల్లి యశోదకు ఎన్నికల ముందు ఇంట ర్వ్యూలకు రమ్మని పిలుపు వచ్చింది. ఎన్నికల కోడ్ అడ్డం రావడంతో ఇంటర్వ్యూలను ఆపేసి వారందరికీ ఇప్పుడు నిర్వహించా రు. కానీ పిల్లి యశోదకు మాత్రం ఇంటర్వ్యూ లెటర్ రా లేదు. అయినా లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే  సీడీపీఓ అడ్డుకున్నారనీ, ఇక్కడి నుంచి వెళ్లిపొమన్నారని ఆమె ఆవేదన చెందు తూ జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ కంటే ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వచ్చిన   కాంతమ్మ అనే మహిళకు పోస్టు కట్టబెట్టేందుకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయని నెల్లిమర్ల ప్రాజెక్టు పరిధిలోని బొప్పడాం గ్రామానికి చెందిన మజ్జి హైమావతి, పతివాడ పైడిరాజు ఆరోపిస్తూ ఫిర్యాదుచేశారు.  ఈ మూడు చోట్లే కాదు అంగన్‌వాడీ కార్యకర్తల, ఆయాల నియామకాల న్నింటిలోనూ ఈ తతంగమే సాగింది. జిల్లా వ్యాప్తంగా 36అంగన్‌వాడీ కార్యకర్తలు, 66 హెల్పర్లు, 86 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, 226 లింక్ వర్కర్ల కోసం ఇంటర్వ్యూలు జరిగాయి. వీటి నియామకాలు దాదాపు టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరిగాయి.

 

 అర్హులను పక్కన పెట్టి తమకు కావలసిన వారిని భర్తీ చేశారని, ఈ క్రమంలో పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారిందని గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదుచేసిన పలువురు ఆరోపించారు. లక్షలాది రూపాయలకు పోస్టులు అమ్ముకున్నారన్న ఫిర్యాదులు  వెల్లువెత్తుతున్నాయి. గ్రీవెన్‌సెల్‌కు వచ్చిన ఫిర్యాదుల తాకిడి చూస్తే అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ఎంత అడ్డగోలుగా జరిగిందో స్ప ష్టమవుతోంది. బాధితుల ఆక్రందనలతో  కలెక్టరేట్ హోరెత్తింది.జిల్లా కో ఆర్డినేటర్ (ఒకటి),  జిల్లా అసిస్టెంట్ కో ఆర్డినేటర్(ఒకటి), 12బ్లాక్ లెవెల్ కోఆర్డినేటర్లు, 17 అసిస్టెంట్ బ్లాక్ లెవెల్  కో ఆర్డినేటర్ పోస్టుల కోసం మంగళవారం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. వీటికి ఇప్పటికే  బేరసారాలు జరిగిపోయినట్టు తెలుస్తోంది. ఏకపక్షంగా భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలు, సిఫారసులుంటే  చాలు పోస్టు వచ్చేస్తుందన్న ఆరోపణ గట్టిగా విన్పిస్తోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top