అంగన్‌వాడీల్లో ‘అక్షయపాత్ర’ వద్దు


  ఏపీ అంగన్‌వాడీ యూనియన్ నాయకుల డిమాండ్15న చలో పార్లమెంట్ విజయవంతానికి పిలుపు

 

 పీఎన్‌కాలనీ (శ్రీకాకుళం):అంగన్‌వాడీ కేంద్రాల్లో నూతనంగా అమలు చేసిన ‘అక్షయపాత్ర’ పథకాన్ని రద్దు చేయాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్‌‌స యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.హిమాప్రభ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫిబ్రవరి 5న ‘అక్షయ పాత్ర’ అనే పథకాన్ని ప్రారంభించారని, పాతవాటినే కొనసాగించలేని ప్రభుత్వం కొత్త పథకాలకు ఏమిస్తుందని విరుచుకుపడ్డారు.



ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే అని మండిపడ్డారు. 2015-2016 ఆర్థిక సంవత్సరంలో ఐసీడీఎస్‌కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కోత విధించడంతో పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా సరిగా లేదని, భవనాల అద్దెలు, టీఏ, డీఏలు గత 8 నెలలుగా చెల్లించలేదని పేర్కొన్నారు. 2016-2017 బడ్జెట్‌లో ఐసీడీఎస్‌కు రూ.26,533 కోట్లు కేటాయించాలని, అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 15న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అంగన్‌వాడీ ఉద్యోగులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ గౌరవాధ్యక్షులు ఎం.జయలక్ష్మి, ఉపాధ్యక్షులు డి.సుదర్శనం, సహాయ కార్యదర్శి పి.లతాదేవి, ట్రెజరర్ కె.క ల్యాణి, టి.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top