నూజివీడు టీడీపీలో రగులుతున్న అసమ్మతి


  • బాబు ఏకపక్ష నిర్ణయంపై తమ్ముళ్ల కినుక

  •  ముద్దరబోయినకు టికెట్‌పై ఆగ్రహం

  •  తమ ప్రభావం తగ్గుతుందని ఒక వర్గంలో భయాందోళనలు

  •  మంచిచేసుకొనే పనిలో ముద్దరబోయిన

  •  పశ్చిమకృష్ణా/నూజివీడు, న్యూస్‌లైన్ : నూజివీడులో తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీటు కేటాయింపు విషయంలో చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. ఆ పార్టీ జిల్లా, స్థానిక నాయకత్వాలు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు టికెట్ ఇవ్వొద్దని కోరినా అధినేత ఆయనకే కట్టబెట్టడంపై ఆ పార్టీశ్రేణులు భగ్గుమంటున్నాయి.



    ముత్తంశెట్టి కృష్ణారావు వర్గీయులు ఆగిరిపల్లిలో శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టి బాబు తీరును దుయ్యబట్టారు. పునరాలోచన చేయకుంటే తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ముద్దరబోయిన పార్టీలోనే చేరలేదని, పచ్చ జెండాలు కట్టుకొని బైక్ ర్యాలీలు చేసినంత మాత్రాన టీడీపీ నాయకుడు ఎలా అవుతాడని, నిన్నటి వరకు పార్టీలోని ఒక బలమైన వర్గం వాదిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా, ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి బాబులు మచిలీపట్నానికి చెందిన బచ్చుల అర్జునుడుకు సీటు ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టారు. బచ్చుల ఆర్జునుడు నూజివీడు నుంచి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈక్రమంలో ముద్దరబోయినకు టికెట్ ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి.

     

    గ్రూపుల గోల..

     

    వ్యూహాత్మకంగా వ్యవహరించి టికెట్ సాధించిన ముద్దరబోయినకు టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టికెట్ చేజారిపోతుందనుకుంటున్న తరుణంలో టీడీపీ రాష్ట్ర నేత యనమల రామకృష్ణుడు ద్వారా మంత్రాగం నడిపారు. కనకవర్షం కురిపించైనా నూజివీడులో గెలుస్తానని బాబుకు హామీ ఇచ్చి ముద్దరబోయిన టికెట్ తెచ్చుకున్నారని సమాచారం. ప్రాదేశిక ఎన్నికల్లో నూజివీడులో టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించడం కోసం ముద్దరబోయిన ఒక మండల పార్టీ నాయకుడి ద్వారా రూ.3.50 కోట్లు ఖర్చు చేసినట్లు భోగట్టా. ప్రస్తుతం ఆ నాయకుడికి నూజివీడు పట్టణ, మిగిలిన మండలాల నేతలకు పొసగకపోవడంతో ముద్దరబోయిన నాయకత్వాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

     

    వేధింపుల్ని ఎలా మర్చిపోదాం..!

     

    ముద్దరబోయిన నాయకత్వాన్ని టీడీపీలోని బలమైన ఒక సామాజికవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తమ సామాజికవర్గాన్ని ముద్దరబోయిన వేధింపులకు గురిచేశారన్నది ఆ వర్గం వాదన. ఈక్రమంలోనే ఆది నుంచి ఆయనకు సీటు ఇవ్వొద్దని గట్టిగా పట్టుబట్టారు. అనూహ్యరితీలో ముద్దరబోయినకు సీటు దక్కడంపై ఆ సామాజికవర్గ నేతలు కంగుతిన్నారు. ముద్దరబోయిన నూజివీడులో కూడా గెలిచి పాత పద్ధతినే అవలంబిస్తే తమ వర్గం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆ సమాజికవర్గ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఏకపక్షంగా సీటు ఖరారు చేసిన నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. నూజివీడు పట్టణ నాయకులు మొదటి నుంచి ముద్దరబోయిన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. దీంతో ఇప్పుడు ముందుగా పట్టణ నాయకులను మంచిచేసుకొనేందుకు ముద్దరబోయిన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చాట్రాయి మండలంలోని తమ బంధువు ద్వారా ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి మండలాల నాయకులతో సర్దుబాటు చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

     

    నాయకత్వ లేమి..

     

    నూజివీడులో టీడీపీ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. మాజీ ఎమ్మెల్యే కోటగిరి హనుమంతరావు మృతి దరిమిలా ఆపార్టీకి సమర్థ నేత కరువయ్యారు. 2009 ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో పార్టీలో చేరి అనూహ్య విజయాన్ని సాధించిన చిన్నం రామకోటయ్య ఏడాదిన్నర కిందటే టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఒక సామాజిక వర్గం వేధింపులే రామకోటయ్య పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి కారణమని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ టీడీపీలో ఎమ్మెల్యే స్థాయి గల నేత లేకపోవడంతో వలస నాయకులకు టికెట్ కట్టబెట్టాల్సి వచ్చిందని ఆ పార్టీ సీనియర్ నాయకురు ఒకరు ‘న్యూస్‌లైన్’ వద్ద వాపోయారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top