ఈ పేద గీతం.. పెను మోసం!

ఈ పేద గీతం.. పెను మోసం! - Sakshi


 ఖజానాలో డబ్బుల్లేవంటూ పథకం ప్రకారం చంద్రబాబు ప్రచారం

 ఉద్యోగుల పీఆర్సీలో కోతలు, ప్రజలపై పన్ను వాతలకు వ్యూహం


     

 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు పదో వేతన కమిషన్(పీఆర్‌సీ) చేసిన సిఫారసుల్లో కోతలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల కుదింపు, రుణ మాఫీ లబ్ధిదారులను భారీగా తగ్గించే దిశగా రాష్ర్ట ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అలాగే ప్రజలపై పన్నులు, చార్జీల భారం వేసేందుకూ రంగం సిద్ధం చేసింది. ఇందుకోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిరోజులుగా ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఖజానాలో డబ్బుల్లేవంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. నిజంగా ఖజానా ఖాళీ అయిందా అన్న విషయాన్ని లోతుగా పరిశీలిస్తే అలాంటి పరిస్థితేమీ లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టి ప్రజలపై పన్నుల భారం మోపడమే ఈ ప్రచారం వెనుకనున్న అసలు వ్యూహమని తెలుస్తోంది. నిజానికి ఈ నెల 7న విజయవాడలో జీరో స్థాయి బడ్జెట్ సమావేశం నిర్వహించే వరకు ఖజానాకు నిధులు బాగానే వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర సొంత పన్నులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు అన్నీ కలిపి ఆదాయం బాగానే సమకూరుతున్నట్లు చెప్పుకొచ్చాయి. తీరా ఉద్యోగుల పీఆర్సీపై చర్చల సమయానికి హఠాత్తుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైనట్లు స్వయంగా ముఖ్యమంత్రే పేర్కొనడం గమనార్హం. జీతాలకు కూడా డబ్బుల్లేవని ఆయన ప్రచారం చేస్తున్నారు. దీంతో ఉద్యోగవర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

 

 గతంలోనూ ఇదే తీరు!: చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ డీఏను సకాలంలో ఇవ్వలేదని, పెన్షనర్లకూ ఎగనామం పెట్టారని ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన హయాంలో శ్వేతపత్రాలు ప్రకటించిన తర్వాత జీతాలకు డబ్బుల్లేవంటూ ప్రజలపై విపరీతంగా పన్నుల భారాన్ని మోపారని, ప్రతీ ఏటా క్రమం తప్పకుండా విద్యుత్ చార్జీలు పెంచారని, ఇప్పుడు కూడా సరిగ్గా అదే బాటలో చంద్రబాబు పయనిస్తున్నట్లు స్పష్టమవుతోందని ఉద్యోగవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 29 శాతమే పీఆర్సీ ఉంటుందంటూ ప్రభుత్వ గెజిట్ పత్రిక రాసిందని, అది కూడా ప్రభుత్వ ఎత్తుగడలో భాగమేనని వ్యాఖ్యానిస్తున్నారు. పీఆర్సీ పెద్దగా రాదంటూ ఉద్యోగులను మానసికంగా సిద్ధం చేయడంలో భాగంగానే అలా రాసినట్లు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క పన్నుల భారం మోపడానికి ప్రజలను కూడా మానసికంగా తయారు చేయడంలో భాగంగానే ప్రభుత్వం బీద అరుపులు అరుస్తోందని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కూడా భారీగా కోతలు పెట్టేందుకే ఇలాంటి ప్రచారం చేస్తోందని విద్యార్ధివర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక పక్క ముఖ్యమంత్రి, మంత్రులు తమ విలాసాలకు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ.. మరోపక్క డబ్బుల్లేవంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంలో విద్యుత్ చార్జీలను పెంచే ముందు.. విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయంటూ ప్రచారం చేసేవారని, ఇప్పుడు కూడా చంద్రబాబు అదే బాటలో నడుస్తున్నారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. బడ్జెట్‌లో పేర్కొన్న మేరకే కేంద్ర నిధులు, గ్రాంట్లు వస్తున్నాయని, రాష్ట్ర ఆదాయం కూడా బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు. జీతాలకూ డబ్బుల్లేవని ముఖ్యమంత్రి ప్రకటించిన మరుసటి రోజే ప్రభుత్వం కావాలనే రూ. 470 కోట్ల మేర నిధుల సేకరణ(వేస్ అండ్ మీన్స్)కు వెళ్లిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతకుముందే మార్చిలోగా రూ. 3 వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.

 

 బడ్జెట్‌లోనూ కాకి లెక్కలు..!

 

 రాష్ర్ట విభజన నేపథ్యంలో కేంద్రం నుంచి అదనంగా రూ. 14,500 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తాయని భావిస్తున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే ఈ నిధులు కచ్చితంగా వస్తాయన్న నమ్మకం లేదు. మిగతా కేంద్ర నిధులన్నీ సక్రమంగానే వస్తున్నాయి. పైగా ప్రణాళికేతర వ్యయాన్ని రాష్ర్ట ప్రభుత్వం భారీగా చూపెట్టింది. ఇది కూడా వాస్తవ దూరంగా ఉంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రాష్ర్ట ప్రణాళికేతర వ్యయాన్ని బడ్జెట్‌లో రూ. 94,380 కోట్లుగా పేర్కొనగా ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏకంగా రూ. 85,151 కోట్లను కేటాయించింది. దీంతో బడ్జెట్ లెక్కలకు వాస్తవికతకు పొంతన లేదని అవగతమవుతోంది.





 

 - అటవీ, గనులు, పబ్లిక్ సర్వీసు కమిషన్, పోలీసు చలానాలు, వడ్డీలు తదితర రంగాల ద్వారా పన్నేతర ఆదాయం వస్తుంది.

 - కార్పొరేట్ పన్ను, ఆదాయ పన్ను, సంపద పన్ను, కస్టమ్స్ పన్ను, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్‌లో కేంద్రం నుంచి వాటా వస్తుంది.

 - కేంద్ర ప్రయోజిత పథకాలు, 13వ ఆర్థిక  సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి గ్రాంట్లు వస్తాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top