ఆంధ్రా సీఎం చాంబర్ కోసం పరిశీలన

ఆంధ్రా సీఎం చాంబర్ కోసం పరిశీలన


హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం చాంబర్, సీఎం కార్యాలయం, కేబినెట్ హాల్ ఏర్పాట్లపై అధికారులు సోమవారం పరిశీలన జరిపారు. ఇందు కోసం సచివాలయంలోని హెచ్ బ్లాక్ను ఉన్నతాధికారులు పరిశీలించారు. గవర్నర్ నరసింహన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, కమలనాథన్ కలిసి ఈ సందర్భంగా చర్చలు జరిపారు. మరోవైపు ఐటీ శాఖతో గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల విభజన, పైళ్ల డిజిటలేషన్పై చర్చించారు.



సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాకును ఆంధ్రప్రదేశ్ సీఎం, సీఎస్, సీఎం కార్యాలయ అధికారులకు కేటాయించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ బ్లాకులో ఉన్న ఆంధ్రా బ్యాంకును ఎల్ బ్లాకుకు తరలించాలని నిర్ణయించారు.  సౌత్ హెచ్ బ్లాకులో ప్రస్తుతం ఆంధ్రాబ్యాంకు ఉన్న వైపు నుంచే ఆ బ్లాకులోకి సీఎం, సీఎస్, సీఎం కార్యాలయ అధికారులకు రాకపోకలకు ప్రధాన ద్వారం ఏర్పాటు చేయనున్నారు.



ప్రస్తుతం సౌత్ హెచ్ బ్లాకుకు ప్రధాన ద్వారం జి బ్లాకు ముందు నుంచి ఉంది. జి బ్లాకు శిధిలావస్థలో ఉండటంతో పాటు జి బ్లాకు ముందు ప్రధాన ద్వారం వద్ద వాహనాల పార్కింగ్‌కు స్థలం లేదు. ఈ నేపథ్యంలో సౌత్ హెచ్ బ్లాకు ప్రధాన ద్వారాన్ని ఆంధ్రాబ్యాంకు వైపు ఏర్పాటు చేస్తారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయంగా గ్రీన్‌లాండ్ అతిథి గృహాన్ని కేటాయించనున్నారు.



ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయంగా గ్రీన్‌లాండ్‌ను తీర్చిదిద్దడానికి గవర్నర్ ఇప్పటికే తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సౌత్, నార్త్ హెచ్ బ్లాకులను, జె, కె, ఎల్ బ్లాకులను కేటాయించాలని నిర్ణయించగా.. తెలంగాణ ప్రభుత్వానికి ఎ,బి,సి, డి బ్లాకులను కేటాయించాలని నిర్ణయించారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top