వరించిన పురస్కారం


-ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధన సంస్థకు జాతీయ గుర్తింపు

- ఉత్తమ పరిశోధన సంస్థ అవార్డు ప్రదానం

- నలుగురు విశ్రాంత శాస్త్రవేత్తలకు ఉత్తమ అవార్డులు


మార్టేరు(పెనుగొండ రూరల్) :మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధన సంస్థ మరో మైలురాయిని దాటింది. జాతీయ స్థాయిలో పరిశోధనలకు సాంకేతిక పరిజ్ఞాన ం అందించడం, వరి వంగడాల రూపకల్పనకు ఉత్తమ పరిశోధన సంస్థ అవార్డును సొంతం చేసుకుంది.



జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన 20 మంది శాస్త్రవేత్తల్లో నలుగురు శాస్త్రవేత్తలు మార్టేరుకు చెందిన వారే కావడం మరో విశేషం. ఈ అవార్డులను ఆల్ ఇండియా  కో ఆర్డినేటెడ్ రైస్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (ఏఐసీఆర్‌ఐపీ) గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో ఈనెల 12న జరిగిన కార్యక్రమంలో అవార్డును అందుకున్నట్లు మార్టేరు వరి పరిశోధన సంస్థ డైరక్టర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలో భారత దేశంలోని 46 వరి పరిశోధన సంస్థలు పనిచేస్తున్నాయని వివరించారు. 1942లో బెంగాల్‌లో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తులను పెంచేందుకు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సీఆర్‌ఆర్‌ఐని స్థాపించి పరిశోధనలు ముమ్మరం చేసిందన్నారు.



ఈ పరిశోధనలను సమన్వయపరిచేందుకు 1965లో ఏఐసీఆర్‌ఐపీ స్థాపించారన్నారు. ప్రాజెక్టును ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తమ పరిశోధన సంస్థ అవార్డును ప్రకటించారని చెప్పారు. అవార్డును భారతీయ వరి పరిశోధన సంస్థ డైరక్టర్ జనరల్ ఆఫ్ రీసెర్చి డాక్టర్ ఎస్.అయ్యప్పన్,  డీడీజీ డాక్టర్ సంధు నుంచి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ అల్లూరి పద్మరాజు, విశ్రాంత శాస్త్రవేత్తలతో కలసి అందుకున్నట్లు వివరించారు.



నలుగురు విశ్రాంత శాస్త్రవేత్తలకు అవార్డు

ఉత్తమ అవార్డుతో పాటు ఉత్తమ పరిశోధనలకు విశ్రాంత శాస్త్రవేత్తలుగా డాక్టర్ పి.శంకర్రావు, డాక్టర్ పీఎస్‌ఎన్ మూర్తి, డాక్టర్ జి.వెంకట్రావు, డాక్టర్ పి.రామ్మోహనరావులు అందుకున్నట్లు చెప్పారు. దేశంలోని ఆహార ఉత్పత్తుల్లో 25 శాతం దిగుబడులు మార్టేరు వరి పరిశోధన సంస్థ రూపొందించిన వరి వంగడాల ద్వారా రావడమే అవార్డుకు ప్రధాన కారణమన్నారు.



మార్టేరు నుంచి 35 ఏళ్ల క్రితం రూపొందించిన స్వర్ణ వరి వంగడం ప్రస్తుతం దేశంలో కోటీ 65 లక్షల ఎకరాల్లో సాగవుతోందని చెప్పారు. 1925లో స్థాపించిన వరి పరిశోధన సంస్థ నుంచి ఇప్పటి వరకూ 45 రకాల వరి వంగడాలకు రూపకల్పన చేశారని తెలిపారు. వరితో పాటు వాణిజ్య పంటలపైనా మార్టేరులో విస్తృత పరిశోధనలు సాగిస్తున్నట్లు చెప్పారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top