ఐవైఆర్‌ ఇలా చేస్తారనుకోలేదు: పరకాల

ఐవైఆర్‌ ఇలా చేస్తారనుకోలేదు: పరకాల - Sakshi


హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ఐవైఆర్‌ కృష్ణారావుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదనడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ అన్నారు.  సీఎంను ఎప్పుడైనా కలిసే స్వేచ్ఛ ఆయనకు ఉందని, ఐవైఆర్‌ అలా మాట్లాడతారని తాము ఊహించలేదన్నారు.  పరకాల ప్రభాకర్‌ మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.


‘ కృష్ణారావు అంటే మాకు చాలా గౌరవం. రాష్ట్రానికి మీ సేవలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆయనను పిలిచి బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు. మూడేళ్ల పదవీ కాలానికి ఆయనను చైర్మన్‌గా నియమించారు. చంద్రబాబుకు ఐవైఆర్‌పై చాలా నమ్మకం ఉంది. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చాలా పద్ధతిగా నడుస్తోంది. లోటు బడ్జెట్‌ ఉన్నా బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అధిక నిదులు కేటాయించాం.



ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు కొన్ని కట్టుబాట్లకు లోబడి ఉండాలి. వాటిని అనుసరించి మాట్లాడాలి, ప్రవర్తించాలి. ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించడం ఎంతవరకూ సమంజసం. పార్టీకి భజన చేయాలని ఎవరూ అడగలేదు. అడగరు కూడా. ప్రభుత్వ పథకాలను సమర్థంగా చేయాలనే అడుగుతారు. అయితే ప్రభుత్వానికి, శాసనసభ, శాసనమండలికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడంపై అభ్యంతరం తెలిపాం. అంతేతప్ప కృష్ణారావుపై ప్రభుత్వపరంగా ఎలాంటి ఆంక్షలు లేవు.  బ్రాహ్మణ కార్పొరేషన్‌లో ఎలాంటి రాజకీయాలు లేవు.



ఐవైఆర్‌ కృష్ణారావు ప్రభుత్వాన్ని విమర్శించారు. అందుకే  ఆయనను పదవి నుంచి తొలగించాం. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసినవారిని ఐవైఆర్‌ సమర్థించడంలో ఔచిత్యం లేదు. గౌతమీపుత్ర శాతకర్ణి, బాహుబలి, సోషల్‌ మీడియా గురించి ఆయన అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఐవైఆర్‌ నిబద్ధత, నిజాయితీ పట్ల మాకు ఎలాంటి 'సందేహాలు లేదు. ఇప్పటికీ ఆయనపై అమితమైన గౌరవం ఉంది.’  అని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top