పాదయాత్రపై ఏపీ డీజీపీ వార్నింగ్‌...

పాదయాత్రపై ఏపీ డీజీపీ వార్నింగ్‌... - Sakshi


విజయవాడ: చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు ఎలాంటి అనుమతి చేసుకోలేదని తెలిపారు. పాదయాత్రలో ఎవరు పాల్గొనకూడదని ఆయన సూచించారు. డీజీపీ మంగళవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 30, 144 సెక్షన్లు అమల్లో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమించి పాదయాత్రలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ముద్రగడ పాదయాత్రకు భయపడేది లేదని, అలాగే వెనకడుగు వేసేది లేదన్నారు.



కాపు నేతలు గతంలోనూ విధ్వంసాలకు పాల్పడ్డారని, ఎవరైనా ఆస్తులు ధ్వంసం చేస్తే కేసులు పెడతామని ఆయన స్పష్టం చేశారు. సంఘ విద్రోహశక్తులు పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే చూస్తూ ఊరుకోమని డీజీపీ వార్నింగ్‌ ఇచ్చారు. చట్టం గౌరవం లేకుంటే అందరికీ నష్టం జరుగుతుందన్నారు. ఇక ఏపీలో డ్రగ్స్‌ కంటే గంజాయి సమస్య ఎక్కువగా ఉందని, గంజాయి సరఫరా చాలావిధాలుగా జరుగుతుంనద్నారు. అలాగే బెల్ట్‌ షాపులపై చర్యలు చేపట్టామని డీజీపీ పేర్కొన్నారు.



మరోవైపు ముద్రగడ పాదయాత్ర దృష్ట్యా ఏపీ సచివాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. వెంకటపాలెం, మందడం గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎటువంటి ర్యాలీలు, ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా కాపుల రిజర్వేషన్లపై ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి చలో అమరావతి పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top