‘ఖడ్గం’ సినిమా ఘర్షణలపై కేసులు కొట్టివేత

‘ఖడ్గం’ సినిమా ఘర్షణలపై  కేసులు కొట్టివేత - Sakshi


 హిందూపురం : పట్టణంలో 2002 డిసెంబర్ 21న ‘ఖడ్గం’ చిత్రం ప్రదర్శన సందర్భంగా చెలరేగిన అల్లర్ల  కేసును హిందూపురం కోర్టు నిన్న కొట్టి వేసింది. వివరాల్లోకి వెళితే.. 'ఖడ్గం’ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మత పరంగా కించపరిచేలా ఉన్నాయన్న నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం ఆందోళనలు, ఘర్షణలకు, పోటాపోటీగా ర్యాలీలు చేశాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జీ, కాల్పులతో పట్టణం అట్టుడికింది. ఈ ఘటనల్లో ఉమర్ ఫరూక్, మాజీ ముతవల్లి అజీజ్, బాబా, ఫరూక్, సాధిక్‌తో పాటు మొత్తం 53 మందిపై కేసు నమోదయింది.  తొలుత ఆందోళన చేసిన కేసులో మాజీ మున్సిపల్ చైర్మన్ విద్యాసాగర్, రమేష్‌రెడ్డి, గోపాల్, నాగరాజు, అశ్వర్థనారాయణ, శివకుమార్, మరో 15 మందిపై కేసు పెట్టారు.



మరో వర్గంలోని 56 మందిపై కౌంటర్ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పలువురు జైలు పాలయ్యారు. సుదీర్ఘ వాదనల అనంతరం నిందితులపై సాక్ష్యాధారాలు రుజువు కాకపోవడంతో జూనియర్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి గీతా మొదటి కేసులోని 15 మందిపై కేసు కొట్టి వేశారు. తర్వాత కౌంటర్ కేసులోని 36 మంది నిందితులకు విముక్తి కల్పిస్తూ  తీర్పునిచ్చారు. కాగా ఉమర్ ఫరూక్, అజీజ్, బాబా వర్గంలోని 26 మందిపై గత జులై నెలలో కోర్టు కేసులు కొట్టి వేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం విముక్తి లభించడంతో బాధితుల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top