అనకాపల్లి బంద్ విజయవంతం


పాడేరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు మన్యం బంద్ పాటిస్తున్నారు. ఏజెన్సీ 11 మండలాల్లో విజయవంతానికి టీడీపీ, ఉపాధ్యాయ జేఏసీ, ఎన్‌జీవో అసోసియేషన్ పిలుపునిచ్చాయి. మూడు రోజులపాటు రవాణా స్తంభించడంతోపాటు వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడనున్నాయి. ఇందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ప్రయివేటు పాఠశాలలను కూడా మూసివేయాలని నిర్వాహకులను కోరారు. ఆటోలు, ప్రయివేటు జీపులను కూడా ఎక్కడికక్కడ నిలిపివేసి సహకరించాలని మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.



బంద్‌కు మద్దతుగా శనివారం సాయంత్రం పాడేరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. వరుసగా మూడు రోజుల బంద్‌తో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ప్రధానంగా వారపు సంతలు రద్దయ్యే పరిస్థితి . ఆదివారం పాడేరు మండలం మినుములూరు, వంట్లమామిడి, జీకే వీధి మండలం ధారకొండ, జర్రెల, సీలేరు, అరకులోయ మండలం సుంకరమెట్ట, సోమవారం చింతపల్లి మండలం అన్నవరం, జీకే వీధి మండలం ఆర్‌వీ నగర్, పెదబయలు, మంగళవారం  జి.మాడుగుల, చింతపల్లి మండలం లోతుగెడ్డ జంక్షన్‌లో జరిగే వారపు సంతలన్నీ రద్దవుతాయి. నిత్యావసరాలకు కూడా గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొనున్నారు.



ప్రైవేటు వాహనాలు కూడా నిలిచిపోతే మన్యంలో  రవాణా పూర్తిగా స్తంబించనుంది. ఇక అరకులోయ, అనంతగిరిల్లోని పర్యాటక ప్రాంతాలు మూతపడనున్నాయి. మ్యూజియం, పద్మావతి గార్డెన్, టూరిజం హోటళ్లకు మరింత నష్టం వాటిల్లుతుంది. పర్యాటకులు తమ రాకను వాయిదా వేసుకోవాలని సమైక్యాంధ్ర జేఏసీ, ఏపీఎన్‌జీవో నాయకులు ఇప్పటికే పిలుపునిచ్చారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top