15 నుంచి నిరవధిక దీక్ష

15 నుంచి నిరవధిక దీక్ష - Sakshi


15లోగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన రాకుంటే గుంటూరు వేదికగా నిరశనకు దిగుతా: వైఎస్ జగన్

 

హోదాపై బాబుకు చిత్తశుద్ధి లేదు 

ఓటుకు కోట్లు కేసులో ఆయన అడ్డంగా చిక్కారు

దాన్నుంచి తప్పించుకునేందుకు హోదాను తాకట్టు పెట్టారు

ఆయన మాటలవల్లే ఐదుగురు బలిదానం చేసుకున్నారు

ఇవ్వాళ కూడా మేం పట్టుబడితే తీర్మానం పెట్టారు

కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే దీక్ష


 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 15 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 15 నెలలైందని, ప్రత్యేక హోదాపై ఇంకా ఎంతకాలం సాగదీస్తారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదన్నారు. విభజన జరిగేటపుడు అప్పటి అధికారప్రతిపక్షాలు రెండూ కలసి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై 15 నెలలుగా ఏమీ జరగలేదు. ఎప్పటిలోగా చేస్తారంటే సమాధానం రాదు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని ఇంకా తీవ్రతరం చేయాలని, దీనికి అందరూ ఒక్కటై పోరాడాలని జగన్ పిలుపు నిచ్చారు. ప్రత్యేక హోదా కావాలని తాను ఇప్పటికే మంగళగిరిలో, ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. వీటితోపాటు తమ పార్టీ పిలుపు మేరకు జరిగిన రాష్ట్ర బంద్‌ను, కమ్యూనిస్టులు చేసిన బంద్, తాను 15 నుంచి చేయబోతున్న నిరాహారదీక్షను కూడా చూపించి చంద్రబాబు హోదా కోసం పట్టుపట్టాలని జగన్ డిమాండ్ చేశారు. లేకుంటే బాబు మెడలు వంచైనా హోదా సాధిస్తామన్నారు.

 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 15వ తేదీ నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్షకు చేపట్టనున్నట్టు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి చేసే క్రమంలో భాగంగా తాను ఈరోజు నుంచి (మంగళవారం) 15 వ తేదీ వరకూ సమయం ఇస్తున్నానని, 15 వ తేదీన నిరాహారదీక్షను ప్రారంభిస్తానని చెప్పారు. ఆయన మంగళవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో సహచర ఎమ్మెల్యేల సమక్షంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనేది ఈరోజు శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరును బట్టి స్పష్టంగా రుజువైందని, ఆయన నుంచి ఏ మాత్రం సంతృప్తికరమైన సమాధానం రాలేదని విమర్శించారు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని ఇంకా తీవ్రతరం చేయాలని, దీనికి అందరూ ఒక్కటై పోరాడాలని జగన్ పిలుపు నిచ్చారు.



ప్రత్యేక హోదా కావాలని తాను ఇప్పటికే మంగళగిరిలో రెండు రోజులపాటు నిరాహారదీక్ష చేశానని, ఆ తరువాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వేలాదిమంది కార్యకర్తలు, ప్రత్యేక హోదాను వాంఛించే ప్రజలతో కలిసి ఢిల్లీలో ఒక రోజు ధర్నా చేశామని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం చేసిన ఆందోళన, తమ పార్టీ పిలుపు మేరకు జరిగిన రాష్ట్ర బంద్‌ను, కమ్యూనిస్టులు చేసిన బంద్‌ను చూపించి రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదాను ఎంతగా వాంఛిస్తున్నారో కేంద్రానికి నచ్చజెప్పి తాను 15వ తేదీ నుంచి చేయబోతున్న నిరాహారదీక్షను కూడా చూపించి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం గట్టిగా పట్టుపట్టాలని జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్రానికి చూపించి ప్రత్యేక హోదాను సాధించాలని, లేకుంటే చంద్రబాబు మెడలు వంచైనా ఇది సాధిస్తామని తేల్చిచెప్పారు. ఇంకా ఆయనేం చెప్పారంటే...



ఎంత కాలమంటే చెప్పరెందుకు?

చంద్రబాబు అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ప్రత్యేక హోదాపై ఇంకా ఎంతకాలం సాగదీస్తారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు. విభజన జరిగేటపుడు అప్పటి ప్రధానమంత్రి, అధికారప్రతిపక్షాలు రెండూ కలిసి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై 15 నెలలుగా ఏమీ జరగలేదు. ఎప్పటిలోగా చేస్తారంటే సమాధానం రాదు. ఇవాళ తీర్మానం కూడా మేము గట్టిగా పట్టుపడితేనే పెటా ్టరు. ఈ తీర్మానానికి బలం రావాలి, కేంద్రంపై ఒత్తిడి పెరగాలి అంటే కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను ఉపసంహరించుకుంటేనే సాధ్యమవుతుందని చెప్పాం. 15 రోజులో లేదా ఒక నెల రోజులో  డెడ్‌లైన్‌ను ఇచ్చి... ఈలోపుగా కేంద్రం ప్రత్యేక హోదాను ప్రకటించకపోతే అందరమూ కలిసి మరో నాలుగడుగులు ముందుకేస్తామని కేంద్రానికి గట్టిగా చెప్పాలని డిమాండ్ చేశా. చంద్రబాబు ఏమీ చేయకపోగా ప్రజలను అయోమయంలో పడేసే విధంగా ప్రకటనలు చేస్తున్నారు.



చంద్రబాబు ఢిల్లీలో ఒకరకంగా, విజయవాడలో మరో రకంగా మాట్లాడుతున్నారు. ఇక కేంద్ర మం త్రులైతే తలో రకంగా మాట్లాడుతూ గం దరగోళంలో పడేస్తున్నారు. ఇలా అయోమయపరిచే ప్రకటనలవల్ల, ఉద్యోగాలు రావనే భయంతో రాష్ట్రంలో ఐదుగురు మరణించారు. ముగ్గురు ఆత్మబలిదానాలు చేసుకుంటే మరో ఇద్దరు గుండె ఆగి మరణించారు. మరో ఐదుమంది ఆత్మహత్యాయత్నం చేసుకుని చికిత్స పొందుతున్నారు. ఆ బాధిత కుటుంబాలకు ఒక్క దమ్మిడీ కూడా ఆర్థిక సాయం ప్రభుత్వం ఇంతవరకూ చేయలేదంటే... ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుం బాలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది.

 

 

చంద్రబాబు, కేంద్రం మారాలి


చంద్రబాబు మారాలి, చిత్తశుద్ధితో ఆయన కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే ప్రత్యేక హోదా వస్తుందనే విషయం ఆయన మర్చిపోకూడదు. అలా కాకుండా లంచాలతో సంపాదించిన డబ్బుతో ఓటుకు కోట్లు ఇస్తూ... అడ్డగోలుగా సంపాదించిన బ్లాక్‌మనీని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ వీడియో, ఆడియో టేపుల్లో దొరికిపోయి, ఆ కేసుల నుంచి బయట పడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి బయటపడే యత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర మంత్రివర్గానికి, నీతి ఆయోగ్‌కు, ప్రణాళికా సంఘం ఉంటే దానికి, ఎన్డీసీకి నేతృత్వం వహించేది ప్రధానమంత్రే. అన్నింటికీ  ఆయనే నేతృత్వం వహిస్తున్నప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ నిర్ణయం తీసుకోవడానికి ఎందుకింత ఆలస్యం అయిందంటే... సమాధానం చెప్పేవారు లేరు. అందుకే ప్రత్యేక హోదాకోసం కేంద్రంపై ఒత్తిడి తీవ్రతరం చేసేందుకే నిరాహారదీక్షకు పూనుకుంటున్నా. సెప్టెంబర్ 15 వ తేదీ నిరాహారదీక్షే కాదు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఒత్తిడి చేసే కార్యక్రమాలు చేపడతాం. ప్రత్యేక హోదాపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మెడలు వంచేవరకూ ఈ పోరాటం కొనసాగుతుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top