శాన్వీ ఆత్మకు శాంతి!

శాన్వీ ఆత్మకు శాంతి!


చిన్నారితోపాటు నానమ్మ హత్యకేసు తీర్పుపై స్వగ్రామంలో హర్షం

రఘునందన్‌కు ఉరి




‘అకలిగొన్నవారి మొఖం చూడలేకపోయేది సత్యవతి.

గ్రామంలో ఎవరు కష్టాల్లో ఉన్నా సహాయం చేసేది.

 మా గ్రామంలో అలాంటివారు ఇంకా పుట్టరు కూడా.

బంగారం లాంటి కాపురం.. సత్యవతి మృతితోనే నాశనం అయింది.

చిట్టిపొట్టి చిన్నారి శాన్విని కూడా పొట్టనపెట్టుకున్నాడు. అందుకే ఆ రఘు ఇప్పుడు శిక్ష అనుభవించాడు’ ఈ మాటలు ఇప్పుడు కుడుములకుంటలో వినిపిస్తున్నాయి.    


            



ప్రకాశం జిల్లా : శాన్వి ఆత్మకు శాంతి లభించింది.. ఆమె నాన్నమ్మకు కూడా! అమెరికాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని.. నేరస్తులు తప్పించుకోలేరని హంతకుడు రఘునందన్‌కు విధించిన మరణశిక్షతో తేలింది. అమెరికాలో 2012లో చిన్నారి శాన్వి, ఆమె నానమ్మ వెన్న సత్యవతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై సత్యవతి స్వగ్రామం అయిన హనుమంతునిపాడు మండలం కుడుముల కుంట వాస్తవ్యులు హర్షం వ్యక్తం చేశారు.



చిన్నాభిన్నం అయిన కుటుంబం..

సత్యవతి భర్త వెన్నా కొండారెడ్డి చాలా కాలం గ్రామంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడు ఉంటారో.. ఎప్పుడు ఉండరో ఎవరికీ తెలియడంలేదు. వచ్చిన రోజు అన్నం వండుకొని.. కూరలను కనిగిరి నుంచి తెచ్చుకుని మళ్లీ కనపడకుండా వెళ్లిపోతారు. ఇద్దరు కుమారులు అమెరికా లోనే ఉన్నారు. కుమార్తె సుజాత గుంటూరులో ఉంటోంది. సత్యవతి లోకం విడిచాక ఇక్కడి ఇంటిలో దీపం వెలిగించేవారు లేకుండా పోయారు. ఇల్లు కూడా శిథిలావస్థకు చేరుకుంటోంది. అందరి తలలో నాల్కలా ఉన్న సత్యవతి మరణాన్ని గ్రామస్తులు ఇప్పటికీ మరచిపోలేదు. వారి నిమ్మ తోటలు, ఆస్తిపాస్తులు అన్నీ నాశనం అయ్యాయి. నిందితునికి సరైన శిక్ష పడిందని అంతా అంటున్నారు.



సత్యవతి ఇంటిలో దీపం పెట్టేవారే లేరు:

చిన్నారి శాన్విని చూసుకోనేందుకు కుమారుడు ప్రసాదు రెడ్డి వద్దకు సత్యవతి వెళ్లింది. ఫోను చేసి గ్రామంలో అందరి కష్ట సుఖాలను తెలుసుకొనేది. ఆమె మరణంతో ఇంటిలో దీపం వెలిగించే వారు లేకుండా పోయారు. కొండారెడ్డి..కుమారులు, కుమార్తె వద్ద కాలం కడుపుతున్నాడు.

– సానికొమ్ము వెంకటసుబ్బమ్మ



ఎప్పుడో ఉరి శిక్ష వేసి ఉండాల్సింది:

డబ్బుకు ఆశపడి చిన్నారి శాన్విని, నానామ్మ వెన్నా సత్యవతిని అతి కిరాతకంగా హత్య చేసిన హంతకుడు రఘునందన్‌కు వెంటనే ఉరివేసి ఉంటే చాలా సంతోషంగా ఉండేవాళ్లం. ఇప్పటికైనా అమెరికా ప్రభుత్వం మరణ శిక్షను విధించి మంచి పని చేసింది.

– వీరాచారి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top