'చంద్రబాబు గుండెల్లో రైళ్లు'

'చంద్రబాబు గుండెల్లో రైళ్లు' - Sakshi


హైదరాబాద్‌: నంద్యాల ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలబడతారని.. ధర్మాన్ని గెలిపిస్తారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. అధికార టీడీపీ నాయకులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఓటర్లు ప్రశాంతంగా ఓటేశారని కితాబిచ్చారు. వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని సీఎం చంద్రబాబు అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చేశారని మండిపడ్డారు.



ప్రజల అభిప్రాయం ప్రపంచానికి తెలుస్తున్న భయంతోనే నంద్యాల ఉప ఎన్నికకు ఆయన ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఓడిపోతామన్న భయంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇంత డబ్బు విచ్చలవిడిగా పంచడం, ఇన్ని ప్రలోభాలకు గురి చేయడం ఎప్పుడూ చూడలేదని వాపోయారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి చంద్రబాబు ఎదిగారో, దిగజారారో ప్రజలే చెప్పాలన్నారు. అమరావతిలో మనిషి కూర్చున్నారు కానీ మనసంతా నంద్యాలలో ఉందని పేర్కొన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ గది నుంచి ఆదేశాలిస్తున్నారని.. ఎక్కడ డబ్బులు పంచాలో, ఎవరి ప్రలోభ పెట్టాలో స్వయంగా సీఎం చెప్పడం దారుణమని వ్యాఖ్యానించారు. చివరి నిమిషంలో దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేయగా, ఎన్నికల పరిశీలకులు పట్టుకున్నారని తెలిపారు. క్యూలో ఉన్నవారికీ డబ్బులు పంచుతున్నారని, పోలీసులు చంద్రబాబు చెప్పుచేతుల్లో ఉండే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.



అరాచకం సృష్టించి గెలవాలని ప్రయత్నిస్తున్నారని, ఓటమి భయంతో దాడులకు దిగుతున్నారని విమర్శించారు. దుర్మార్గమైన రాజకీయానికి విత్తు నాటిన వ్యక్తి చంద్రబాబు అని, డబ్బులుంటే చాలు గెలవొచ్చన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నీతి వాక్యాలు బ్రహ్మాండంగా చెబుతున్నారు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు దుర్మార్గమైన పద్ధతులు అవలంభిస్తున్నారన్నారు. చంద్రబాబు విధానాలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారని కోరారు.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top