సినిమా ఫ్లాపయినా... హిట్ సంబరాలా?

సినిమా ఫ్లాపయినా... హిట్ సంబరాలా? - Sakshi


హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందరోజుల పాలనపై వైఎస్ఆర్ సీపీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు వంద రోజుల సినిమా ఫ్లాపయినా హిట్ అయిందని సంబరాలు జరుపుకోవటం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. బాబు వందరోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఘనతను చంద్రబాబు తన ఖాతలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో అంబటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ  కొన్నిచోట్ల బొగ్గులేక విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతే విద్యుత్ వెలుగులు అంటూ బాబు గొప్పలు చెబుతున్నారన్నారు.



రుణమాఫీపై చంద్రబాబు చేశారా అని ఈ సందర్భంగా అంబటి సూటి ప్రశ్న వేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాబు 200 వాగ్ధానాలు చేశారని, పాదయాత్రలో మరో 300 వాగ్దానాలు చేశారని ఆయన గుర్తు చేశారు.  ఇప్పటిదాకా చంద్రబాబు ఒక్క వాగ్దానాన్నీ కూడా నెరవేర్చలేదన్నారు. ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకు రుణమాఫీ కాలేదన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ఎక్కడైనా అమలయిందా అని ప్రశ్నించారు. రూ.2కే మినరల్ వాటర్ ఎవరైనా ఇప్పటిదాకా తాగారా అన్నారు.



బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పిన బాబు ...మద్యం అమ్మకాలు ఎక్కడైనా తగ్గాయా .... పదవీ విరమణ వయస్సును ఎవరికి పెంచారని అంబటి ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు పరిపాలన అధ్వాన్నంగా ఉందే తప్ప...ఏమాత్రం మెచ్చుకోదగ్గ పాలన కొనసాగలేదన్నారు. రుణమాఫీ చేస్తానన్న బాబు... మాఫీ అమలు కోసం కమిటీ వేశారని, మరోవైపు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే మళ్లీ తను ఒక కమిటీ వేసి చంద్రబాబే ఏపీ రాజధానిని ప్రకటించారని అంబటి విమర్శించారు. శాసనసభలో చర్చ జరగకుండానే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top