దొరికింది

దొరికింది - Sakshi


 అమలాపురం టౌన్ : అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో గల్లంతైన వివాదాస్పద ఫైలు ఎట్టకేలకు దొరికింది. కమిషనర్ శివనాగిరెడ్డి ఏసీబీకి దొరికేందుకు కారణమైన ఈ ఫైలు అదృశ్యమైన సంగతి తెలిసిందే. మున్సిపల్ కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో ఓ మూలన ఎవరూ ఉపయోగించని తాళం లేని పాత బీరువాలో ఆ ఫైలు ప్రత్యక్షం కావడం అనుమానాలకు తావిస్తోంది.

 

 ఏసీబీ అధికారులు ఇంజనీర్లు కాంట్రాక్టరు బాబి పనికి సంబంధించిన ఫైలు కమిషనర్ వద్దే ఉందని, ఆయనకే పంపించేశామని చెప్పుకొచ్చారు. ఏసీబీ విచారణలో కమిషనర్ ఆ ఫైలు తన వద్ద లేదని... రిమార్కు రాసి ఇంజనీరింగ్ విభాగానికి పంపించానని చెప్పారు. ఇలా భిన్న వాదనలతో ఏసీబీ అధికారులు ఆఫైలు కోసం గాలించారు. అయితే దొరకలేదు. దీంతో ఏసీబీ అధికారులు, మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ కూడా ఫైలు గల్లంతుకు ఇంజనీర్లే కారణమన్న అభిప్రాయానికి వచ్చారు.

 

 అనుమానాలు... సందేహాలు

 ఇదే సమయంలో ‘సాక్షి’లో ఫైలు గల్లంతుపై ‘అసలేమైనట్టు..’? శీర్షికన సోమవారం ప్రచురితమైన కథనంలో ఫైలు ఎందుకు అదృశ్యమైంది? అంటూ మూడు కోణాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కమిషనర్‌పై ఏసీబీ దాడి జరిగిన రోజు రాత్రి వరకూ ఆ ఫైలు కోసం ఏసీబీ కానిస్టేబుళ్లు, రీజనల్ డెరైక్టర్ సమక్షంలో ఇంజనీరింగ్ సిబ్బంది అంగుళం అంగుళం గాలించారు. అయితే ఆ సమయంలో కనిపించిన ఫైలు సోమవారం మధ్యాహ్నం ప్రత్యక్షమైంది. వర్క్ ఇన్‌స్పెక్టర్ భాస్కరరావు కుర్చీ వద్ద ఉన్న ఆ పాత బీరువా తలుపుతీసి ఉండడాన్ని గమనించి దానిలో ఫైలును గుర్తించారు. ఆ సమాచారాన్ని డీఈఈ త్రినాథరావు రీజనల్ డైరక్టర్ రవీంద్రబాబుకు అందించారు. అయితే ఈ ఫైలు అక్కడికి ఎలా చేరింది. దానికి అక్కడ ఎవరు ఉంచారు అనే విషయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 పరిస్థితులకు భయపడే ఫైలు ప్రత్యక్షం

 ఏసీబీ అధికారులు, మున్సిపల్ రీజనల్ డెరైక్టర్‌ల విచారణల్లో ఫైలు గల్లంతుకు ఇంజనీర్ల నిర్లక్ష్యమే కారణమన్న అభిప్రాయానికి వచ్చారు. దీనికి తోడు రీజనల్ డెరైక్టర్ కూడా ఇదే విషయమై హైదరాబాద్ డీఎంఏకు నివేదిక ఇచ్చారు. దీంతో తమపై చర్యలు తీసుకునే పరిస్థితులు ఎదురవుతుండటంతో ఇంజనీరింగ్ విభాగం సిబ్బందిలో భయం పట్టుకుంది. ఈ విషయమై డీఈఈ త్రినాథరావును ‘సాక్షి’ వివరణ కోరగా ఇలా చెప్పుకొచ్చారు... ‘‘అదృశ్యమైన ఫైలు.. వెతికిన బీరువాలోనే దొరకడం మాకూ ఆశ్చర్యంగా ఉంది. కాంట్రాక్టర్ బాబి చేసిన పనికి సంబంధించిన ఫైలుపై కమిషనర్ రిమార్కు రాసి... ఇంజనీరింగ్ విభాగానికి పంపారు. దానిపై మళ్లీ ఇంజనీర్లు రిమార్కులకు సమాధానం చెబుతూ కమిషనర్‌కు పంపించారన్న పరిణామాల్లో స్పష్టత వచ్చింది.’’

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top