ఏయ్! నీ కథ చూస్తా..

ఏయ్! నీ కథ చూస్తా.. - Sakshi


అనంతపురం రూరల్ : మంత్రి పరిటాల సునీత అనుచరుల దౌర్జన్యం పునరావృతమైంది. మంత్రి అనుచరుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాట్నేకాలువ శ్రీనివాసులు అనంతపురం తహశీల్దార్ (మండల మెజిస్ట్రేట్) షేక్‌మహబూబ్ బాషాపై బుధవారం దాడికి యత్నించారు. తహశీల్దార్‌పై ఆయన చాంబర్‌లోనే చేయి చేసుకునేందుకు వెళ్లడంతో ఉద్యోగులు ఒక్కసారిగా హడలెత్తారు.


 


డిప్యూటీ తహశీల్దార్ కుమారస్వామి, ఆర్‌ఐ సంజీవరెడ్డి, వీఆర్‌ఓలు అడ్డుకోవడంతో దాడి యత్నం దూషణలు, కేకలతో ఆగింది. అనంతపురం తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన సంఘటనపై అక్కడ పనిచేసే అధికారులు, వీఆర్‌ఓలు, మైనార్టీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోతామంటూ నినాదాలు చేశారు.

 

నిజాయితీగా వ్యవహరించినందుకేనా..

బుధవారం ఉదయం టీడీపీ నేతలు పామురాయి వెంకటేశ్, కాట్నేకాలువ శ్రీనివాసులు, ఎంపీపీ భర్త రవీంద్ర తహశీల్దార్‌ను కలిసేందుకు వెళ్లారు. తమకు చెందిన వారి పట్టాను ఎందుకు రద్దు చేశారంటూ వాదనకు దిగారు. నిబంధనలకనుగుణంగానే చేయాల్సి వచ్చిందని అధికారి వివరించారు. నడిమవంక జన్మభూమి రోడ్డు వద్ద 9 సెంట్లలో ఆరు కుటుంబాలు రోడ్డును ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్నాయన్నారు. దీనిపై అక్కడ హౌస్‌సైట్ లబ్ధిదారులు రాస్తాకు ఇబ్బంది అవుతుందని ఫిర్యాదు చేశారన్నారు.  నెల క్రితం దీనిపై మునిసిపల్ కమిషనర్‌తో కలసి విచారణ చేపట్టి, రోడ్డును వెడల్పు చేయడంతో భాగంగా పట్టాలు రద్దు చేశామన్నారు. వాస్తవంగా వీరికి ముందుగానే పట్టాలు కూడా ఉండడంతో రద్దు చేయాల్సి వచ్చిందన్నారు.  

 

ప్రేక్షక పాత్ర పోషించిన టీడీపీ నేతలు: మా ప్రభుత్వంలో మాకు న్యాయం చేయకపోతే ఎలా..? ఎవరు చెబితే రద్దు చేశారు... మొదట ఆ పట్టాలు తిరిగి మంజూరు చేయాలంటూ కాట్నేకాలువ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. దీంతో తహశీల్దార్ అధికారులతో మాట్లాడుకోవడం నేర్చుకోవాలాన్నారు. నీవెంత, మేం చెబితే చేయాల్సిందే.. ఏమనుకున్నావ్. జాగ్రత్త... నీ కథ చెబుతా అంటూ తహశీల్దార్‌పై దాడికి దిగాడు. పక్కన ఉన్న టీడీపీ నేతలు ప్రేక్షక పాత్ర వహించారు. చివరికి కార్యాలయం సిబ్బంది అడ్డుకుని శ్రీనివాసులును కార్యాలయం నుంచి బయటకు తీసుకెళ్లారు.

 

ఆవేదన వ్యక్తం చేసిన తహశీల్దార్: దాడి  యత్నంపై తహశీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీర్థకాలిక సెలవులో వెళ్లిపోతాన న్నారు. తను ఏ తప్పు చేయకున్నా ఇలా చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

 కేసు నమోదు.. అరెస్ట్ : కాట్నేకాలువ శ్రీనివాసులుపై తహశీల్దార్, కార్యాలయ సిబ్బంది  త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుర్భాషలాడడంతో పాటు, కొట్టేందుకు వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుణ్ని అరెస్టు చేశారు.

 

ఐఎంఎం ధర్నా: దాడి ఘటనపై ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్ బాషా నేతృత్వంలో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులపై దాడి చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎం నేతలు జిలాన్ బాషా  పాల్గొన్నారు.  

 

పాత రోజులు గుర్తు తెప్పిస్తున్నారు

అనంతపురం రూరల్: అధికారులపై దాడులు చేయడం తెలుగుదేశం నేతలకు షరామూలైపోయింది. వీరి దెబ్బకు జిల్లాలో ఐదారు మంది దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారని వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు ఆలమూరు సుబ్బారెడ్డి, గోవింద్ రెడ్డి, నాగమ్మ, భూమిరెడ్డి కిరణ్‌కుమార్ రెడ్డి, బాలాజీ, సర్పంచ్‌లు పెద్దిరెడ్డి, లోక్‌నాథ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పది రోజుల క్రితం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బయట వ్యక్తులు వచ్చి తమపై దాడికి యత్నించారన్నారు. జిల్లా పోలీసు అధికార యంత్రాంగం దాడికి పాల్పడుతున్న వారిపై నిఘా ఉంచితే బాగుంటుందన్నారు.

 

ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చిన అవాజ్ పార్టీ నాయకులు  

తహశీల్దార్ షేక్ మహబూబ్ బాషాపై దాడికి యత్నించిన వారిని కఠినంగా శిక్షిలాంటూ.. అవాజ్ పార్టీ నాయకులు ఎస్. సికిందర్, ఎ. వలీ, తదితరులు ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్‌కు వినతి పత్రం అందజేశారు. అధికారపార్టీకి చెందిన నాయకులు తహశీల్దార్‌పై ఇలా దాడులకు దిగడం సహించ రాని నేరమన్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.  

 

నిరసన కార్యక్రమాలకు తరలిరండి

గురువారం ఉదయం 10.30 గంటలకు చేపట్టే నిరసన కార్యక్రమానికి తరలి రావాలని జిల్లా గ్రామ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వై. సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. నగరంలోని వీఆర్‌ఓలు పెద్ద ఎత్తున హాజరుకావాలన్నారు.

 

సరైన పద్ధతి కాదు

తహశీల్దార్‌పై దాడికి యత్నించడం దారుణం. టీడీపీ నేతలు దౌర్జన్యాలు చేయడం సరైన పద్ధతి కాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

  - రమేష్, జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు

 

అరాచక శక్తులను అడ్డుకుంటాం

అధికారుల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వారిని టీడీపీ సస్పెండ్ చేసి, స్టేషన్‌లో అప్పజెప్పాలి. అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అరాచక శక్తులను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.  - సీపీ వీరన్న(వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top