ఆ ఎస్‌ఐ తీరేవేరు !


 ఏకపక్ష చర్యల్లో బి.మఠం పోలీసులు

 ఎస్పీ నిక్కచ్చిత్వాన్ని ప్రోత్సహిస్తున్నా...


మారని కిందిస్థాయి అధికారులు

 

కడప: నిజాయితీ, నిబద్ధత, బాధితులకు సమన్యాయం, విధి నిర్వహణలో నిక్కచ్చితత్వాన్ని కడప ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ప్రోత్సహిస్తున్నారు. కానీ కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి ఆ స్పృహ ఇప్పటికీ ఉండడం లేదు. అధికారపార్టీ నేతలు కనుసైగలు చేస్తే చాలు, చట్టాన్ని వారి చుట్టంగా మలుస్తున్నారు. నిందితుల పట్ల సమన్యాయం కరువవుతోంది. వివాదం ఒక్కటే అయినా సెక్షన్లు వర్తింపజేయడంలో వివక్ష చూపుతున్నారు. తుదకు ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకుంటున్నా సరే...బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ కోవలోకి జిల్లాలోని బి.మఠం ఎస్‌ఐ ముందు వరుసలో నిలుస్తున్నారు.



అనధికార ఎమర్జెన్సీ అమలు

మైదుకూరు నియోజకవర్గ పరిధిలో గత కొంతకాలంగా అనధికార ఎమర్జెన్సీ అమలులో ఉంది. అందుకు పలు ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. ఫెస్టిసైడ్స్ వ్యాపారులు టీడీపీ తీర్థం పుచ్చుకోకపోతే వ్యవసాయాధికారులు తనిఖీలంటూ వేధింపులకు పాల్పడుతారు. రేషన్‌డీలర్లు పార్టీ మారకపోతే విజిలెన్సు కేసులు, రెవెన్యూ అధికారుల వేధింపులు ఉత్పన్నమౌతాయి. ఉపాధిహామీ పథకం పీల్డ్ అసిస్టెంట్లు జై కొట్టకపోతే తప్పుడు కేసులు నమోదు. పోలీసు అధికారులు కొందరు స్వయంగా పార్టీ ఫిరాయించాల్సిందిగా, పచ్చకండువా కప్పుకోవాల్సిందిగా నిసిగ్గుగా ఒత్తిడి తెస్తున్నారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అన్నీశాఖల అధికారులు 95శాతం ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడమే అందుకు కారణంగా తెలుస్తోంది. తుదకు అంత్యక్రియలు, కర్మక్రియలకు హాజరయ్యేందుకు కూడా ఆంక్షలు పెడుతున్న ఘటనలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మైదుకూరు నియోజకవర్గ ప్రజల్లో అధికారుల పట్ల క్రమేపీ విశ్వాసం సన్నగిల్లింది. ఎంతోకొంత పోలీసుశాఖ నిక్కచ్ఛిగా విధులు నిర్వర్తిస్తే ఆ భావన కనుమరుగయ్యే అవకాశం ఉంది. వారిలోనూ చిత్తశుద్ధి కొరవడింది.



వివాదం ఒక్కటే.. వేర్వేరు సెక్షన్లు

బి.మఠం మండలం డి.నేలటూరులో మన్నెం శంకర్‌రెడ్డి, మన్నెం సుబ్బారెడ్డి అనే దాయాదుల మధ్య వివాదం నెలకొంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాలు రాళ్ల దాడికి గురయ్యారు. ఈ ఘటన గత శనివారం చోటుచేసుకుంది. అయితే పోలీసులు మన్నెం సుబ్బారెడ్డి వర్గంపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శంకర్‌రెడ్డి వర్గీయులపై మాత్రం బెయిల్‌బుల్ సెక్షన్లతో కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటున్న వారిని సైతం కేసులో చొప్పించడం గమనార్హం. ఇంతటి ఏకపక్ష చర్యలకు ఏకైక కారణం అధికారపార్టీ ఆదేశాలేనని తెలుస్తోంది. కేసు నమోదులోనే వివక్ష అనుకుంటే పొరపాటే. రిమ్స్‌లో చికిత్సలు పొందుతున్నా సుబ్బారెడ్డి, ఈశ్వరరెడ్డిలను బుధవారం మధ్యాహ్నం పోలీసులు పట్టుకెళ్లారు.


బి.మఠం ఎస్‌ఐ రంగస్వామి తన సిబ్బందితో కలిసి వైద్యులు డిశ్ఛార్జి చేయకపోయినా బెడ్‌పై ఉన్న వారిద్దరిని కేసులో నిందితులంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదే విషయాన్ని రిమ్స్ మెడికల్ రికార్డులో సైతం వైద్యసిబ్బంది పొందుపర్చారు. ఇప్పటికే మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నా వారిని అరెస్టు చూపడం విశేషం. కాగా రిమ్స్‌లో చికిత్స పొందుతున్న సుబ్బారెడ్డి, ఈశ్వరరెడ్డిలను స్టేషన్‌కు తీసుకెళ్లాక వారి ఆరోగ్యం దెబ్బతిన్నట్లు సమాచారం. స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ ద్వారా చికిత్సలు చేయించినట్లు తెలుస్తోంది. పొద్దుపోయాక రిమ్స్‌కు తిరిగి అప్పగించాలనే దిశగా పోలీసులు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. ఒకే కేసులో విపత్కర పరిస్థితులను బి.మఠం పోలీసులు సృష్టిస్తుండడం విశేషం.



 ఎస్పీ కొరడా ఝుళిపిస్తున్నా.....

జిల్లా పోలీస్ బాస్‌గా వారం రోజుల క్రితం రామకృష్ణ బాధ్యతలు చేపట్టారు. తనదైన శైలిలో విధులు నిర్వర్తిస్తూ పోలీసు అధికారుల్లో అలసత్వాన్ని పోగొట్టేందుకు కృషిచేస్తున్నారు. మరోవైపు పోలీసుల సంక్షేమం వైపు దృష్టి సారిస్తూ పని ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు వీక్లీ ఆఫ్ తీసుకోవాల్సిందిగాా ఉత్తర్వులిచ్చారు. పనితీరులో తప్పిదాలపై కఠిన వైఖరి ప్రదర్శిస్తూ ఛార్జి మెమోలు జారీ చేశారు. ఎస్పీ నిశితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో సైతం కొందరు అధికారులు ఏకపక్ష చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈక్రమంలో బి.మఠం పోలీసులు ఉదంతాన్ని పలువురు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా ఎస్పీకి తగ్గట్లుగా యంత్రాంగం నడుచుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దారితప్పుతున్న పోలీసు అధికారులను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఎస్పీపై మరింతగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.



ఎస్‌ఐ ఏమన్నారంటే.....

బి.మఠం మండలం దిగువ నేలటూరులో పరస్పర ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వర్గానికి చెందిన వారికి తలకు బలమైన గాయాలయ్యాయి. ఆకారణంతో హత్యాయత్నం కేసు నమోదు చేశాం. రిమ్స్‌లో ఎంఎల్‌సీ అడ్మిషన్‌లో ఉన్న నిందుతులు ఇదివరకే డిశ్ఛార్జి అయ్యారు. రిమ్స్ నుంచి మేము అదుపులోకి తీసుకోలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top