హోదా సాధించకుంటే భావితరాలు క్షమించవు

హోదా సాధించకుంటే భావితరాలు క్షమించవు - Sakshi


రేపటి బంద్‌లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి

బంద్‌తోనైనా టీడీపీ, బీజేపీలకు దిమ్మ తిరగాలి

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి


 

 మంగళగిరి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోతే భావితరాలు క్షమించవని, హోదా సాధన కోసం ఈ నెల 29వ తేదీన వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్ లో రాష్ట్ర ప్రజలంతా ఏకమై పాల్గొని విజయవంతం చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 29వ తేదీ ప్రయాణాలను వాయిదా వేసుకుని బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలన్నారు. టీడీపీ, బీజేపీలకు దిమ్మ తిరిగేలా బంద్‌లో పాల్గొనాలని ఆర్కే కోరారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురై తుడిచిపెట్టుకుని పోయిందన్నారు.



అదేవిధంగా ఎన్నికల హామీలలో ప్రత్యేక హోదాపై హామీలు గుప్పించి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీలు అనంతరం రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశాయని, కాంగ్రెస్‌కు పట్టిన గతే రాష్ట్రంలో టీడీపీ, బీజేపీలకు త్వరలోనే పట్టనుందన్నారు. హోదా సంజీవని కాదని చెబుతున్న చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఎన్నికలలో పదేళ్లు, పదిహేనేళ్లు హోదా కావాలని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా ఇస్తామని ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. 



హోదా సాధించలేకపోతే రాష్ట్రం ఆధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హోదా కోసం నిర్వహించే బంద్‌లో వ్యాపారవర్గాలు, ప్రజా సంఘాలు, హోదా సాధన కమిటీలు అంతా ఏకమై బంద్‌ను విజయవంతం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని ఆర్కే పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top