నవ వసంతం.. శుభ సంకల్పం


కర్నూలు (ఓల్డ్‌సిటీ): కొత్త ఏడాది.. నవ్యాంధ్ర నిర్మాణానికి కలిసికట్టుగా పనిచేద్దామనే శుభ సంకల్పంతో అందరూ ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలను డిప్యూటీ సీఎం జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినా తెలుగుతల్లి మనదేనన్నారు. నవ్యాంధ్ర నిర్మాణానికి ఈ సంవత్సరం ఆహ్వానం పలుకుతూ ప్రతిఒక్కరు శ్రమించాలన్నారు. ప్రభుత్వోద్యోగులు సహనం కోల్పోకుండా నిరంతరం శ్రమిస్తేనే నవ్యాంధ్ర నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ రాజధాని నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు.

 

 ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఎలా ఉన్నాయో అదే రీతిలో జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొని దృఢ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. కరువు ప్రాంతమైన రాయలసీమ జిల్లాల్లో రైతులు మూడు పంటలు పండించేందుకు అవసరమైన సాగునీరు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ మాట్లాడుతూ.. జిల్లాను ఆర్థిక రాజధానిగా మార్చేందుకు ప్రయత్నం మొదలు పెట్టామన్నారు. ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. మన్మథ నామ సంవత్సరంలో చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

 

  ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లి ఫ్యాక్షన్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా దత్తత తీసుకున్న కప్పట్రాళ్ల గ్రామాన్ని వచ్చే ఆరు నెలలో భారీగా అభివృద్ధిపరచి ఫ్యాక్షన్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. జెడ్పీ ఛైర్మన్ మల్లెల రాజశేఖర్, జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌లు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెల్పుతూ ఉగాది సందేశాన్ని ఇచ్చారు. అంతకు ముందు మంగళ వాయిద్యాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. కొలనుభారతి ఆస్థాన విద్యాంసుడు శశిభూషణ్ సిద్ధాంతి పంచాంగ పఠనం చేశారు. కవిసమ్మేళనంలో భాగంగా ఎలమర్తి రమణయ్య, పార్వతీదేవి, నొస్సం నరసింహాచారి, ఇల్లూరి నాగరత్నం శెట్టి, కేబీఎస్ కుమార్, మద్దూరి రామ్మూర్తి, హయగ్రీవాచార్యులు, ఎం.శాంతమ్మలు తమ కవితలను వినిపించారు. ఉగాది పర్వదిన వైశిష్ఠ్యాన్ని, ప్రాముఖ్యతను నొస్సం నరసింహాచారి తెలియజేశారు.

 

 అనంతరం సాహిత్యం, సంగీతం, నాట్యం, పరిశోధన, సామాజిక సేవలు వంటి వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన పి.బి.పి.శ్రీనివాస్, విజయలక్ష్మి, హీరాలాల్, పోతన, మద్దయ్య, కృష్ణమూర్తి, గురుస్వామి, డాక్టర్ రంగయ్య, డాక్టర్ కె.భాస్కర్‌రెడ్డి, జె.ఎస్.ఆర్.కె.శర్మ, మధుర భారతుల సుబ్రహ్మణ్యంలను సన్మానించారు.  వేడుకల్లో కలెక్టర్ సతీమణి సత్యరేఖ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శమంతకమణి, డీఆర్వో గంగాధర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ వి.వి.ఎస్.మూర్తి, సీపీఓ ఆనంద్‌నాయక్ తదితర జిల్లా అధికారులు ప్రజలు పాల్గొన్నారు.

 

 అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..

 సునయన ఆడిటోరియంలోని వేదికపై విద్యార్థులు ప్రదర్శించిన బృంద నృత్యాలు కనువిందు చేశాయి. కూచిపూడి నృత్యం ద్వారా నృత్యజ్యోతి నృత్యశాల విద్యార్థినులు ప్రేక్షకులను అలరింపజేశారు. గణేశ పంచరత్నానికి చక్కటి నృత్య అభినయం చేశారు. ఇదే సంస్థకు  చెందిన సంక్రాంతి వచ్చింది తుమ్మెదా అంటూ చేసిన నృత్యాలు కూడా ఆకట్టుకున్నాయి. శారదా సంగీత కళాశాల విద్యార్థినులు ఓహో.. ఓహో.. వసంతమా.. అంటూ ప్రదర్శించిన నృత్యం ప్రేక్షకులు దృష్టి మరల్చకుండా చేసింది. అలాగే అబ్బా వాడే.. ఎంత చక్కనోడే అనే నృత్యాన్ని అదే కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు చక్కగా ప్రదర్శించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top