‘భారం’ ప్రజలపైనే!


 కర్నూలు(అర్బన్): ఆర్థిక వనరులను పెంపొందించుకునేందుకు ప్రభుత్వం ప్రజలపైనే భారం మోపుతోంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్ల శాఖపై దృష్టి సారించింది. భూముల ధర పెంచడం ద్వారా ఆదాయం రాబట్టేందుకు నిర్ణయించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి సవరించిన ధరలను అమల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కసరత్తు పూర్తి చేసి ఉన్నతాధికారుల అనుమతికి నివేదిక పంపారు. ఇందుకు సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లినట్లు సమాచారం. పెంపు భారం అందరిపై వేస్తే ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత తప్పదనే ఉద్దేశంతో ముందుగా మున్సిపల్ ప్రాంతాల్లో మాత్రమే పెంపునకు సిద్ధమైంది.



ఈ నేపథ్యంలో జిల్లాలోని కర్నూలు నగరపాలక సంస్థతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు మున్సిపాలిటీలు.. గూడూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ నగర పంచాయతీల్లో భూముల రేట్లను పెంచాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాంతాల్లో 0 నుంచి 30 శాతం వరకు పెంచేందుకు ఆయా ప్రాంతాలను బట్టి అధికారులు ధరలను నిర్ణయించినట్లు సమాచారం. పెంచిన రేట్లపై నేటి(గురువారం) సాయంత్రానికి స్పష్టత రానుంది. ప్రాంతాన్ని బట్టి చదరపు గజానికి రూ.1000 నుంచి రూ.2వేల వరకు పెంపు ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.



ఇదిలాఉండగా భూముల ధరతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయనే సమాచారంతో ప్రజలు క్రయవిక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. ఫలితంగా రిజిస్ట్రార్ కార్యాలయాలకు తాకిడి పెరిగింది. గత నెల ఆషాడం కావడం.. ప్రస్తుతం శ్రావణ మాసం మొదలవడంతో లావాదేవీలు జోరందుకున్నాయి. జిల్లాలోని కర్నూలు, నంద్యాల పరిధిలోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ఆర్థిక సంవత్సరం మూడు నెలలకు రూ.3,889.07 లక్షలు లక్ష్యం కాగా.. ఇప్పటికే రూ.2483.18 లక్షల పురోగతి సాధించినట్లు అధికారుల ద్వారా తెలిసింది.

 

నగరపాలక సంస్థలో పెరగనున్న రేట్లు

నగరపాలక సంస్థలో ఇటీవల విలీనమైన స్టాంటన్‌పురం, మామిదాలపాడు, మునగాలపాడు గ్రామ పంచాయతీలతో పాటు జోహరాపురంలోని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. స్టాంటన్‌పురం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక చదరపు గజం రూ.2,500 ఉండగా.. చార్జీలు పెరిగితే రూ.5 వేలకు చేరుకోనుంది. 45వ వార్డు పరిధిలో రూ.7 వేల నుంచి రూ.8 వేలు.. మామిదాలపాడులో రూ.2,500 నుంచి రూ.3 వేలు.. మునగాలపాడులో రూ.700 నుంచి రూ.1000 వరకు, జోహరాపురంలోని పలు ప్రాంతాల్లో రూ.1200 నుంచి రూ.3 వేలు.. ప్రకాష్‌నగర్, బంగారుపేటలో రూ.7 వేల నుంచి రూ.8 వేలకు ధర పెరగనుంది. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో చార్జీల పెంపు ఉండకపోవచ్చని తెలుస్తోంది. మిగిలిన అన్ని మున్సిపల్, నగర పంచాయతీల్లో భూముల ధర పెంపు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనుంది

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top