అవన్నీ రాజకీయ చార్జిషీట్లే


ప్రత్యేక కోర్టుకు నివేదించిన ‘హెటిరో’ న్యాయవాది

జగన్‌ను ఇబ్బంది పెట్టేందుకే కేసు




హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ దాఖలు చేసినవన్నీ రాజకీయ చార్జిషీట్లేనని హెటిరో ఫార్మా తరఫు న్యాయవాది పట్టాభి ప్రత్యేక కోర్టుకు నివేదించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు, అనేకమంది ఐఏఎస్ అధికారులు మారారని, అయినా అప్పటి ప్రభుత్వం చేసిన భూకేటాయింపులు నిబంధనలకు విరుద్ధమని ఎవరూ ఆరోపించలేదని తెలిపారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లకు చట్ట పరిధిలో ఎలాంటి విలువ లేదన్నారు. జగన్ కంపెనీల్లో తాము చట్టబద్ధంగానే పెట్టుబడులు పెట్టామని, ఈ కేసు నుంచి తమను తొలగించాలని కోరుతూ హెటిరో ఫార్మా, ఆ సంస్థ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డిలు వేర్వేరుగా దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి సోమవారం విచారించారు. ఈ సందర్భంగా పట్టాభి వాదనలు విన్పిస్తూ..  కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టే దిశగానే సీబీఐ దర్యాప్తు సాగిందని చెప్పారు. క్విడ్‌ప్రోకో పద్దతిలోనే ఈ పెట్టుబడులు వచ్చాయంటూ సీబీఐ చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని, అభూతకల్పనలని నివేదించారు.



హెటిరోకు కేవలం లీజు పద్ధతిలో, ఎటువంటి అభివృద్ధీ చేయని భూములను కేటాయించిన విషయాన్ని సీబీఐ దాచిందని చెప్పారు. దీన్నిబట్టే సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా జరగలేదని, దురుద్దేశపూర్వకంగా, న్యాయస్థానాలను తప్పుదోవపట్టించే దిశగా సాగిందని స్పష్టమవుతోందని అన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top