భూ బాధితులకు భరోసా

భూ బాధితులకు భరోసా - Sakshi


► పేదలకు అండగా తుదికంటా పోరాడతాం

► ముదపాక రైతులకు అఖిలపక్షం హామీ

► కబ్జా అయిన భూముల సందర్శన

► అడ్డుకోవాలని ప్రయత్నించిన అధికార పార్టీ నేతలు

► రైతులను భయపెట్టినా ఫలితం శూన్యం




‘భూ బాధితుల పక్షానే ఉంటాం.. తుదికంటా వారికి అండగా నిలుస్తాం. అధికార పార్టీ కబ్జాల కోరల్లో చిక్కుకున్న భూములను రక్షించి.. తిరిగి రైతులపరం చేసేందుకు అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తాం’.. అని అఖిలపక్ష నేతలు భరోసా ఇచ్చారు. అధికార పార్టీ నేతల భూదందాలపై చేపట్టిన ఐక్య పోరాటంలో భాగంగా సోమవారం వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం పెందుర్తి మండలం ముదపాక సందర్శించింది. టీడీపీ నేతలు ఆక్రమించుకున్న 400కు పైగా ఎకరాల అసైన్డ్‌ భూములను పరిశీలించి.. బాధిత రైతులతో మాట్లాడింది.. ఆందోళన వద్దని.. అండగా ఉంటామని హామీ ఇచ్చింది.



సాక్షి, విశాఖపట్నం : ప్రాణాలు పోయినా పోరాటం ఆపేది లేదని, కబ్జాల బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అఖిల పక్ష నేతలు స్పష్టం చేశారు. పెందుర్తి మండలం ముదపాకలో సోమవారం అఖిలపక్ష నేతలు పర్యటించి టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను పరిశీలించారు. అధికార పార్టీ భూదోపిడీపై వారంతా మండిపడ్డారు. జిల్లాలో రూ.2 లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగిందని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లే కారకులని ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జీవో 304ను రద్దు చేసేందుకు న్యాయస్థానంలో పోరాటం చేసే అవకాశాలను పరిశీలిస్తామని  హామీ ఇచ్చారు.



చంద్రబాబు, లోకేష్‌ల బినామీ అయిన రామరాజు అక్రమాలకు, విశాఖలో భూముల కుంభకోణాలకు వ్యతిరేకంగా అఖిలపక్షంతో కలిసి మహాధర్నా చేస్తామని ప్రకటించారు. భూ పోరాటం వీడితే ఏవో ప్రయోజనాలు కల్పిస్తామని వెంకటరాజు అనే వ్యక్తి నుంచి తనకు ఓ సందేశం వచ్చిందని వెల్లడించారు. ‘దళితులు, పేదల నుంచి అన్యాయంగా లాక్కున్న భూములను వారికి తిరిగి ఇచ్చేస్తే చాలని, అలాగే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక భూ కబ్జాదారులందరికీ జైలు తప్పదని, చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు, పరుచూరి భాస్కరరావులు వెళ్లాల్సింది జైలుకని’ తాను వారికి బదులిచ్చానని  చెప్పారు.





టీడీపీ నేతల అడ్డంకులు : అఖిలపక్ష బృందం క్షేత్ర స్ధాయి పరిశీలన గురించి తెలుసుకున్న టీడీపీ నేతలు రైతులను బృందం వద్దకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ముందు రోజే పోలీసుల ద్వారా అందరినీ బెరించారు. భూముల పరిశీలనకు వచ్చిన బృందాన్ని ఘెరావ్‌ చేయాలని స్ధానిక టీడీపీ ఎంపీటీసీ రాంబాబు, సర్పంచ్‌ మల్లీశ్వరమ్మ భర్త రమణలు ప్రయత్నించారు. వారిని పోలీసులు, వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకున్నారు. మూడు కిలోమీటర్ల దూరం ర్యాలీగా వెళ్లిన నేతలు అక్కడ భూ కబ్జాదారులు అక్రమంగా నిర్మించిన రోడ్డును పరిశీలించారు.  రైతులు తాము పండిస్తున్న జీడిమామిడి తోటలను నేతలకు చూపించారు. తరతరాలుగా తాము ఈ పంటపైనే ఆధారపడి బతుకుతున్నామని, ఇప్పుడు భూములను అక్రమంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.



ఈ కార్యక్రమంలో ఇతర పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు గుడివాడ అమర్‌నాథ్, అదీప్‌రాజు, తిప్పల నాగిరెడ్డి, కొయ్య ప్రసాదరెడ్డి, కోలా గురువులు, అక్కరమాని విజయనిర్మల, జాన్‌వెస్లీ, రవిరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి,  కొండా రాజీవ్, పసుపులేటి ఉషాకిరణ్, శ్రీదేవివర్మ, జిల్లా అధికార  ప్రతినిధి మూర్తి యాదవ్, పీలా వెంకటలక్ష్మి, సీపీఎం నేత గంగారామ్, తదితరులు పాల్గొన్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top