నిధులున్నా... నిర్లక్ష్యం!


విజయనగరం మున్సిపాలిటీ:  మునిసిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న రూ. కోట్లది నిధులు ఖర్చు చేయటంలో పాలకవర్గాలు విఫలమవుతున్నాయి. 13వ ఆర్ధిక సంఘం పద్దు కింద 2010-11 సంవత్సరం నుంచి 2014-15 సంవత్సరం వరకు ఐదు విడతల్లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీకి రూ. 23.47 కోట్లు మంజూరు  చేయగా...  అధికారిక లెక్కల ప్రకారం 2016 మార్చి నెలాఖరు నాటికి రూ. 8.67 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.



నిబంధనల మేరకు ఈ నిధులతో సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్‌నిర్వహణ లో భాగంగా ఔట్ ఫ్లో డ్రైన్స్‌తో పాటు ప్రధాన డ్రైన్‌ల నిర్మాణం, తాగు నీటి సరఫరాకు వినియోగించాల్సి ఉంది. ఈ  ఏడాది మార్చి నెలాఖరు నాటికి నిధుల వినియోగం గడువు ముగిసిపోగా... రూ14.80 కోట్లు వెనక్కిమళ్లిపోయే ప్రమాదం దాపురించింది. అయితే ప్రభుత్వం తాజాగా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించడంవల్ల ఈ మొత్తాన్ని ఏడునెలల్లో ఖర్చుచేయాలి.

 

నిధుల వినియోగంలో వెనుకబడ్డ విజయనగరం

ప్రభుత్వం విడుదల చేసిన 13వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ విజయనగరం వెనకబడింది. ఈ పద్దు కింద రూ. 12 కోట్లు మంజూరు చేయగా.. కేవలం రూ. 3కోట్లు మాత్రమే ఖర్చుచేసినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే వివిధ పద్దుల కింద మున్సిపల్ ఖజానాలో రూ. కోట్లాది నిధులు మూలుగుతుండగా... వాటిని ఖర్చు చేయటం ఎలాగో తెలీక సతమతమవుతున్న పాలకులు, అధికారులకు ఆర్ధిక సంఘం నిధులు వినియోగం కత్తిమీద సాములా మారింది.  



బొబ్బిలి మున్సిపాలిటీకి రూ2.75కోట్లు విడుదల చేయగా.. రూ. 1.67 కోట్లు ఖర్చు చేశారు. సాలూరు మున్సిపాలిటీకి రూ. 3.56 కోట్లు కేటాయించగా రూ. 1.80కోట్లు, పార్వతీపురం మున్సిపాలిటీకి రూ. 3.59 కోట్లు మంజూరు చేయగా... రూ. 2.39 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి.  అసలు నిధులు లేక అనేక చోట్ల పనులు నిలిచిపోతుంటే.. నిధులుండీ ఖర్చుచేయలేని చేతకాని తనంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

 

గడువులోగా వినియోగిస్తాం: విజయనగరం కమిషనర్

మూలుగుతున్న నిధుల విషయమై విజయనగరం మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా... 13వ ఆర్థిక సంఘం నిధులు వినియోగానికి గడువు పొడిగిస్తూ ఉత్తర్వలు జారీ అయినట్లు తెలిపారు. ఈ నేపధ్యంలో మిగిలి ఉన్న నిధులను వినియోగించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. నిర్దేశించిన గడువులోగా నిధులు వినియోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top