ఆల్ ఫ్రీ... తూచ్!

ఆల్ ఫ్రీ... తూచ్! - Sakshi


* ఎన్నికల ముందు వందలాది ఉచిత హామీలిచ్చిన చంద్రబాబు

* ఆరునెలలవుతున్నా ఒక్కశాతం కూడా అమలు కాని తీరు

* 30 రోజుల్లో నూతన పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని మర్చిపోయారు

* ఆరు నెలల్లో ఎస్సీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ అమలు కాలేదు

* వ్యవసాయ రుణాలపై తొలిసంతకమూ అంతే

* డ్వాక్రా మహిళల రుణాల మాఫీ లేదని తేల్చి చెప్పారు

* కలగా మారిన వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్

* పది లక్షల వృద్ధాప్య, వితంతు పింఛన్లకు కోత

* రాష్ట్ర విభజన- ఆర్థిక సమస్యలంటూ హామీల దాటవేత

* రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పన్ను రాయితీ సాధించడంలోనూ వైఫల్యం


 

సాక్షి, హైదరాబాద్:
ప్రతిపక్షం హెచ్చరించిన చందంగానే, పరిశీలకులు ఊహించిన విధంగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలకు స్వయంగా ‘తూచ్’ మంత్రం పఠించారు. విజయవాడలో గురువారం జరిగిన తెలుగుదేశంపార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల సమక్షంలో పచ్చి అబద్ధాలను కన్నార్పకుండా పలికేయడంతో రాష్ట్ర ప్రజల్లో అక్కడక్కడా మిగిలి ఉన్న భ్రమలు పటాపంచలైపోయాయి. తాను పంటరుణాలు మాత్రమే మాఫీ చేస్తానని హామీ ఇచ్చినట్టూ.

 

 ఇంట్లో ఎన్ని రుణాలున్నా ఒకరికి మాత్రమే... అదీ లక్షన్నర లోపే మాఫీ చేస్తానని వాగ్దానం చేసినట్టూ అవలీలగా బొంకేయడంతో వింటున్న పార్టీ నేతలుసైతం నోళ్లు వెళ్లబెట్టక తప్పలేదు. ఎందుకంటే పంటరుణాలేకాదు, మొత్తం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని, బంగారం తాకట్టు పెట్టిన రుణాలను కూడా తామే కట్టేస్తామనీ, డ్వాక్రా మహిళల రుణాలు కూడా తీర్చేస్తామనీ ఊరూవాడా ఏకం చేస్తూ ఎన్నికల ముందు తెలుగుదేశం చేసిన ప్రచారం జనం మదిలో ఇంకా తాజాగానే ఉంది. మొత్తం 300 వాగ్దానాలతో పంచిన మేనిఫెస్టో ప్రతులు, వేసిన కరపత్రాలు, అంటించిన పోస్టర్లు, మోత మోగించిన టీవీ ప్రకటనలు, పత్రికలనిండా పరుచుకున్న ప్రచారం... ఇంకా సాక్ష్యంగా లభ్యమవుతుండగానే చంద్రబాబు అడ్డంగా బుకాయించడంతో అన్ని వాగ్దానాలూ అటకెక్కినట్టేనన్న విషయం బోధపడింది. అన్నింటికంటే కీలకమైన రైతుల రుణమాఫీ విషయాన్నే తీసుకుందాం. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ ప్రభుత్వం ఈ విషయంలో వేస్తున్న పిల్లి మొగ్గల్ని చూస్తే... పంచపాండవులు మంచంకోళ్లలాగా ముగ్గురే అని రెండు వేళ్లు చూపించిన సామెత గుర్తొస్తుంది. రుణమాఫీకి అర్హమైన రైతుల ఖాతాలను తగ్గించేందుకు ఆరునెలలుగా సర్కారు చేస్తున్న యత్నాలు చూస్తుంటే పీసీ సర్కార్ మేజిక్‌షో గుర్తుకొస్తుంది. ప్రధానమైన ఇతర రంగాల సంగతీ అంతే. డ్వాక్రా మహిళల రుణమాఫీ సంగతి నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్టయింది.

 

సామాజిక పెన్షన్లు పెంచినట్టే పెంచి 10 లక్షలమంది లబ్ధిదారులను కత్తిరించేశారు. ఇంటికో ఉద్యోగం-లేదంటే రెండువేలు నిరుద్యోగ భృతి హామీని పూర్తిగా మరచిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు ఉచితంగా ఇస్తామని స్పష్టంగా చెప్పిన హామీ... ఆ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఖరీఫ్ సీజను పూర్తయి, రబీ సీజన్ కూడా మొదలైనా అమలుకు నోచుకోలేదు. అసలా హామీ ముఖ్యమంత్రి నోట నుంచిగానీ, ఏ ఇతర మంత్రి నోట నుంచి వినిపించడం కూడా లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు తీసుకున్న ఐదు కీలక నిర్ణయాల్లో ఒకటైన ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు తమకూ వర్తింపజేయాలంటూ కార్పొరేషన్ల ఉద్యోగులు మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు.

 

  రాష్ట్రంలో ఉన్న 12 వేలకు పైగా గ్రామాల్లో కనీసం రెండు గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ సుజల పథకం ఏర్పాటుకు నోచుకోలేదు. అధికారంలోకి రాగానే 30 రోజుల్లో నూతన పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని పూర్తిగా మరిచిపోయారు. ఆరు నెలల్లో ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని స్పష్టంగా గడువు పెట్టిన హామీని అమలు చేసి చూపించలేకపోయారు. ఇసుక రీచ్‌లను పంచాయతీరాజ్ శాఖకే అప్పగించి, వచ్చే ఆదాయం దామాషా ప్రకారం గ్రామ, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయిస్తామన్న హామీ అమలుకాలేదు. మార్చి 31న విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రూ. రెండు లక్షల కోట్ల వ్యయమయ్యే హామీలిచ్చారని అప్పట్లోనే ఉజ్జాయింపు లెక్కలు వేశారు. మేనిఫెస్టోలోని ప్రతి హామీనీ, పథకాన్నీ, ప్రణాళికనూ అమలు చేసి ఆదర్శంగా నిలుస్తామని ఎన్నికలప్పుడు ప్రకటించుకున్నారు. అధికారంలోకి వచ్చాకేమో ‘రాష్ట్ర విభజన- ఆర్థిక సమస్యలు’ అంటూ దాటవేత మొదలుపెట్టారు. కానీ ఇప్పటికిప్పుడు ఏ మాత్రం అదనపు ఆర్థిక భారం పడని హామీలూ అమలుకు నోచుకోవడం లేదు. పరిశ్రమల అభివృద్ధికి పన్ను రాయితీలను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించే గురుతర బాధ్యతను నిర్వర్తించగల సత్తా టీడీపీకే ఉందంటూ చెప్పి.. చివరకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందిన ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’, ‘పన్ను రాయితీ’ హామీలలో ఒక్కదానిని కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

 

 టీడీపీ మేనిఫెస్టోలోని కొన్ని హామీలు...

- పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీపైనే తొలి సంతకం. రైతులకు లాభసాటి ధర వచ్చేందుకు స్వామినాథన్ కమి టీ సిఫార్సులు అమలయ్యేలా చూస్తాం. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులకు ఎరువుల సబ్సిడీ నిమిత్తం రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం. రూ.5,000 కోట్లతో పంటల ధర స్థిరీకరణ నిధి ఏర్పా టు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు అం దించి వారికీ రుణసౌకర్యాలు కల్పిస్తాం.

 - వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుతును ఉచితంగా ఇస్తాం. గృహా వసరాలకు, పరిశ్రమలకు నిరంతరాయం గా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తాం. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం.

 - డ్వాక్రా సంఘాలను పునరుజ్జీవింపజేసే ప్రక్రియలో భాగంగా డ్వాకా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం. మహిళా సంఘాలకు రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాం.

 - పుట్టిన బిడ్డ పేరుతో అర్హులైన కుటుంబాలకు రూ. 25వేలు బ్యాంకులో డిపాజిట్ చేసి, వారికి యుక్త వయసు వచ్చేనాటికి రూ. 2 లక్షలను అందజేస్తాం. పేద గర్బిణులకు ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం రూ. 10వేలు అందజేస్తాం

 - ఒక్కొక్క గ్యాస్ సిలిండర్‌కు రూ. 100 సబ్సిడీతో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తాం.

 - అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తాం. మద్యం బెల్ట్‌షాపుల రద్దు, ప్రతి జిల్లాలో డీఆడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం.

 - నిరుద్యోగ యువకులకు రూ. 1,000 నుంచి రూ. 2000 వరకు నిరుద్యోగ భృతి. ఇంటి కో ఉద్యోగం, కళాశాల విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్ కంప్యూటర్లు. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 33 శాతానికి పెంచుతాం. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆధార్‌తో సంబంధం లేకుండా అమలు చేస్తాం.

 - చేనేత కార్మికుల బ్యాంకు రుణాల మాఫీ. పవర్ లూమ్స్‌పైఉన్న రుణాలు కూడా రద్దు చేస్తాం. చేనేత కార్మికులకు రూ. 1000 కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్‌లో ప్రతి ఏటా వెయ్యి కోట్లు కేటాయింపులు. జిల్లాకు ఒక చేనేత పార్కు.

 - ఎస్సీ బ్యాక్‌లాగ్ పోస్టులన్నీ ఆరు నెలల కాలంలో అభ్యర్థులు అందుబాటులో ఉంటే భర్తీ చేస్తాం. ఎస్సీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తాం. భూమి లేని గిరిజన కుటుంబాలకు రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తాం. గిరిజన అమ్మాయి వివాహానికి రూ. 50 వేల ఆర్థిక సహాయం. ప్రతి జిల్లాలో గిరిజన భవన్ నిర్మాణం.

 - ముస్లింలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించే ప్రక్రియను చట్టపరంగా సాధించడానికి కృషి చేస్తాం. దళిత క్రైస్తవులను ఎస్సీల్లోకి చేర్చడానికి చర్యలు చేపడతాం. కాపుల రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్‌ను నియమించి నిర్ణీత కాలవ్యవధిలో బీసీలకు నష్టం కలగకుండా సమస్యను పరిష్కరిస్తాం.

 - ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేస్తాం. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు. ఉద్యోగులు రిటైర్మెంట్‌కల్లా ఇల్లు ండేలా అందుబాటులో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తాం.

 - అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తాం. పరిశ్రమల స్థాపనకు 30 రోజుల్లోనే అన్ని అనుమతులిస్తాం. కడప, అనంతపురం జిల్లాల్లో ఇనుప ఖనిజం ఆధారంగా ఉక్కు ఫ్యాక్టరీలను నిర్మించేందుకు కృషి. జిల్లాల్లో డెయిరీ పరిశ్రమలు పటిష్టం. పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు.

 - శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం నుండి నెల్లూరు జిల్లా దుగరాజుపట్నం వరకు పాత పోర్టులతోపాటు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ప్రతి జిల్లాలో ఒక పోర్టును అభివృద్ధి చేస్తాం. ఈ పోర్టులన్నీ అనుసంధానం చేస్తూ ఇప్పుడున్న కలక త్తా- చెన్నై జాతీయ రహదారికి సమాంతరంగా సముద్రతీరానికి దగ్గరగా మరొక రహదారిని నిర్మిస్తాం. బకింగ్‌హాం కెనాల్‌ను పునరుద్ధరించి జల రవాణాకు అనుకూలంగా మారుస్తాం.

 - ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కల్పించిన ప్రత్యేక ప్యాకేజీలను వినియోగించుకొని అక్కడ పారిశ్రామిక అభివృద్ధి. రాయలసీమ జిల్లాలకు కల్పించిన ప్రత్యేక ప్యాకేజీలను వినియోగించుకొని చిత్తూరు, అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top