మద్యం దుకాణాలకు మహా గిరాకీ


ఇదేదో ఓటింగ్ కేంద్రం..వీరంతా ఓటర్లు అనుకుంటే మీరు పొరబడినట్లే. వీరంతా మద్యం దుకాణాల కోసం క్యూ కట్టిన వారు. రెండేళ్ల కాలపరిమితితో లెసైన్స్‌లు ఇస్తుండడం, ఈ వ్యాపారంలో మంచి ఆదాయాలు ఉండండంతో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 2,224 దరఖాస్తులను సమర్పించారు. ఒక్కో దుకాణానికి వంద మందికి పైగా పోటీ పడడం గమనార్హం. వీరంతా ఆదివారం అదృష్ట పరీక్షను ఎదుర్కోనున్నారు.

 

 కర్నూలు: మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. గడిచిన ఏడాది మద్యం వ్యాపారులు భారీగా లాభాలు గడించారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో మద్యం వ్యాపారంపై కొత్త వ్యక్తులు కూడా దృష్టి సారించారు. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దతగా ఉండటంతో గతంలో ఆ వ్యాపారంలో ఆర్థికంగా స్థిరపడినవారు, వడ్డీ వ్యాపారులు నువ్వా నేనా అన్నట్లు దరఖాస్తుల దాఖలుకు పోటీ పడుతున్నారు.

 

  కొన్నేళ్లుగా బార్లలో సేల్స్‌మెన్లుగా పనిచేసి ఆర్థికంగా స్థిరపడినవారు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఒక్కొక్క దుకాణానికి పదుల సంఖ్యలో దరఖాస్తులను సమర్పిస్తున్నారు. రెండేళ్ల కాల పరిమితితో లెసైన్స్ ఇస్తుండటం కలసివచ్చే అంశంగా భావించి మద్యం వ్యాపారంతో సంబంధం లేనివారు సైతం ఈసారి లాటరీ లక్కు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

 

 లాటరీ తగిలితే వ్యాపారం చేయకుండానే లక్షల రూపాయలు గుడ్‌విల్ పొందవచ్చని ఔత్సాహికులు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు నగరంతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన్, నంద్యాల వంటి ప్రధాన పట్టణాల్లో దుకాణాలకు పోటీ లేకుండా చేసేందుకు మద్యం సిండికేట్లు ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ లాటరీలో దుకాణం దక్కించుకున్న తర్వాత చూద్దాంలే అన్న ధోరణితో కొత్త వ్యక్తులు టెండర్లకు క్యూ కట్టారు.

 

  శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు క్యూలో నిలబడి ఆశావహులు మద్యం దుకాణాలకు దరఖాస్తులు దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, భార్యలతో కూడా చాలామంది టెండర్లు వేయించారు. పదుల సంఖ్యలో  మహిళలు దరఖాస్తులు దాఖలు చేశారు. ఈ ఏడాది 194 మద్యం దుకాణాలకు దరఖాస్తులకు ఆహ్వానించగా 181 దుకాణాలకు 2,637 దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం ఒక్క రోజే 2,224 దరఖాస్తులు వచ్చాయి.  ఆశావహుల నుంచి పోటీ అధికంగా ఉండటంతో 4 వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా టర్నోవర్ ఉన్న దుకాణాలను దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. గతంలో దుకాణాలు పొందినవారు ఈసారి కూడా తమ చేతులు దాటకూడదని భావించి అనుచరులు, కుటుంబ సభ్యులతో పదుల సంఖ్యలో దరఖాస్తులు వేయించారు.

 

  జిల్లాలోని సంతజూటూరు దుకాణానికి గత ఏడాది అత్యధికంగా 41 దరఖాస్తులు దాఖలు చేసి వ్యాపారులు పోటీ పడ్డారు. రుద్రవరం దుకాణానికి 40 దరఖాస్తులు దాఖలయ్యాయి. కానీ ఈసారి నాగలాపురం, దేవనకొండ, కర్నూలులోని చరిత వైన్స్‌కు ఒక్కొక్క దుకాణానికి వందకు పైగా దరఖాస్తులు దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది.

 

 మరో రోజు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు వెయ్యి దరఖాస్తులు దాఖలైనట్లు అధికారుల అంచనా.

 

 బ్యాంకులు కిటకిట...

 రూ.5 లక్షలకు మించకుండా ఈఎండీ కూడా దరఖాస్తుతోనే చెల్లించాల్సి ఉంది. ఒక దరఖాస్తు రుసుం రూ.50 వేలతో కలిపి ప్రతి వ్యక్తి రూ.5.50 లక్షలు డబ్బుతో వస్తుండటంతో రెండు రోజులుగా కర్నూలులో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి.

 

 కనీస సౌకర్యాలు కరువు...

 వందలాదిగా తరలివచ్చిన వ్యాపారులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎక్సైజ్ అధికారులు విఫలమయ్యారు. కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదని టెండర్లు దాఖలు చేయడానికి వచ్చిన వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు కూడా ఇబ్బంది పడ్డారు.

 

 దరఖాస్తు ఫీజు రూపంలో కోట్ల రూపాయలు ఎక్సైజ్ శాఖకు అందుతోంది. ఇంత ఆదాయం వస్తున్నా కనీసం తాగునీరు, కూర్చోడానికి కుర్చీలు ఏర్పాటు చేయలేదని వ్యాపారులు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు మద్యం దుకాణానికి సంబంధించి ఒక వ్యక్తి దరఖాస్తు దాఖలు చేస్తుండగా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అడ్డు తగిలి టెండర్ ఫారాన్ని లాక్కోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు సమాచారం అందడంతో కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐలు రంగనాయకులు, ములకన్నతో పాటు భారీ ఎత్తున స్పెషల్ పార్టీ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో దరఖాస్తు దాఖలు చేసుకోవాలని, దౌర్జన్యానికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.     

 

 సర్కారీ దుకాణాలు ప్రారంభం

 కర్నూలు: మద్యం నూత న పాలసీ అమలు లో భాగంగా జిల్లా వ్యాప్తం గా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణా లను ఎక్సైజ్ అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస నరేష్ రెండు రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మద్యం నూతన పాలసీ అమలుపై చర్చించారు.

 

 కో-ఆపరేటివ్ సొసైటీ, సివిల్ సప్లయ్ గోదాములు, మున్సిపల్ దుకాణాల్లో ప్రభుత్వ ఔట్‌లెట్స్‌ను ప్రారంభించాలని సూచించారు. కొన్నిచోట్ల ప్రభుత్వ దుకాణాలు లేకపోవడంతో అద్దె భవనాల్లోనే ప్రారంభించారు. కర్నూలులో డీవీఆర్ హోటల్ సమీపంలో(కర్నూలు వైన్స్) అద్దె గదిలో దుకాణాన్ని ప్రారంభించారు. కర్నూలు సీఐ పద్మావతి దుకాణాన్ని ప్రారంభించి సేల్స్‌కు అనుమతించారు.

 

 ఎక్కడెక్కడ దుకాణాలు.. ఆదోని, ఆళ్లగడ్డ, ఆత్మకూ రు, బనగానపల్లె, బేతంచెర్ల, కోవెలకుంట్ల, కర్నూలు టౌన్, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన్, నందికొట్కూరు, నంద్యాల, గాజులపల్లె, ఓర్వకల్లు, ఆస్పరి, కోసిగి, సున్నిపెంట, చాగలమర్రిలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top