సింహపురి ఎడారే !

సింహపురి ఎడారే !


 కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకోవచ్చన్న బ్రిజేష్‌కుమార్ తీర్పు సింహపురి పాలిట శాపంగా మారుతోంది. పెన్నానది పరివాహక ప్రాంతంలో సోమశిలతో పాటు నిర్మాణంలో ఉన్న చిన్న ప్రాజెక్టులు నిరుపయోగంగా మారే ప్రమాదం ఏర్పడింది. తాజాగా ఎగువన తెలంగాణలో కృష్ణానదిపై రెండు కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించడం ఇక్కడి రైతుల గుండెల్లో గుబులురేపుతోంది. ఎగువన కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే దిగువకు కృష్ణా మిగులు జలాలు వచ్చే పరిస్థితి ఉండదు. ఫలితంగా నెల్లూరుకు నీటి రాక నిలిచిపోయి లక్షలాది ఎకరాల మాగాణి బీడుగా మారే ప్రమాదం నెలకొంది.

 

 సాక్షి, నెల్లూరు: జిల్లాలో వ్యవసాయం పూర్తిగా సోమశిల జలాశయంలోని నీటిపై ఆధారపడి ఉంది. కర్ణాటకలో పుట్టిన పెన్నానది అనంతపురం, కడప మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. దీనికి పాపాగ్ని, చిత్రావతి, జైమంగలి, చెయ్యేరు, సగిలేరు ఉపనదులుగా ఉన్నాయి. ఇప్పటికే  పెన్నాపై ఎగువన గండికోట, అప్పర్ పెన్నార్, మైలవరం జలాశయాలు ఉన్నాయి.

 

 78 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన సోమశిల జలాశయం పరిధిలో 7.5 లక్షల ఎకరాలు, తెలుగుగంగలో అంతర్భాగమైన కండలేరు జలాశయ పరిధిలో మరో 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.  అయితే ఏటికేటికి వర్షాలు తగ్గి, పెన్నానదికి నీరు చేరడం గగనమైపోతోంది. అదే సమయంలో మిగులు జలాలు వచ్చే మార్గాలు మూసుకుపోతుండడం జిల్లా రైతులను కలవరపెడుతోంది.

 

 ఐదేళ్లలో జూన్ నాటికి సోమశిల నీటి నిల్వ వివరాలను పరిశీలిస్తే..2008లో 40.674 టీఎంసీలు ఉండగా 2,570 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉంది. 2009లో 24.797 టీఎంసీల నిల్వ 2,580 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో, 2010లో 28.445 టీఎంసీల నిల్వ, 50 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో, 2011లో 50.313 టీఎంసీల నిల్వ, 2 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో, 2012లో 33.731 టీఎంసీల నిల్వ, 2 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. గత ఏడాది మాత్రం మొదట్లో కేవలం 8.33 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఆ తర్వాత వర్షాలు ఆలస్యంగా కురవడం, కృష్ణా జలాలు 60 టీఎంసీలు రావడంతో సోమశిల జలాశయం జలకళ సంతరించుకుంది.

 మిగులు జలాలే ఆధారం

 పెన్నానదికి నీటి లభ్యత తగ్గడంతో శ్రీశైలం జలాశయం ద్వారా వచ్చే కృష్ణాజలాలపైనే జిల్లా రైతులు ఆధారపడాల్సి వస్తోంది. తెలుగుగంగ పథకంలో భాగంగా చెన్నై ప్రజల తాగునీటి అవసరాల కోసం కేటాయించిన 15 టీఎంసీల కృష్ణా జలాలు ఇక్కడి రైతులను ఆదుకుంటున్నాయి. చెన్నై వాసులు ఏ నాడు 6 టీఎంసీలకు మించి వాడుకోకపోవడంతో మిగిలిన నీటిని సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలోని ఆయకట్టు రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు.

 

 అయితే గత ఏడాది బ్రిజేష్‌కుమార్ తీర్పు ప్రకారం తెలుగుగంగకు 25 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించారు. ఈ నీటితో కర్నూలు, కడప జిల్లాల పరిధిలోని వెలుగోడు, కేసీ కాలువల ఆయకట్టు 5.25 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. కేటాయించిన నీరు ఆ ఆయకట్టుకే సరిపోయే పరిస్థితి లేకపోవడంతో జిల్లాకు మిగులు జలాలు వచ్చే అవకాశముండదు. పెన్నా పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోతే సోమశిల, కండలేరు ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పని పరిస్థితి.

 

 కొత్త ప్రాజెక్టులు వస్తే..

 కృష్ణానదిపై ఎగువన కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే మిగులు జలాలపై ఆధారపడి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారనుంది. ప్రస్తుతం 90 చెరువులకు, 2 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో రూ. 1,500 కోట్లతో సోమశిల-స్వర్ణముఖి కాలువ పనులు చేపట్టారు. దీనికి 15 టీఎంసీల నీరు అవసరం.  

 

 ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల ప్రజలకు తాగునీరు అందించడంతోపాటు 90 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సోమశిల నుంచి హైలెవల్ కాలువ నిర్మాణానికి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. దీనికి రూ.1,500 కోట్లు అవసరమవుతాయని లెక్కలుగట్టారు. కృష్ణపట్నం ఓడరేవుకు 5 టీఎంసీల నీరు కేటాయించారు.

 

 

 మరోవైపు నెల్లూరు, సంగం ఆనకట్టలతో పాటు తెలుగుగంగ కాలువల నిర్మాణం పూర్తికాలేదు. ఇవన్నీ ఇలా ఉంటే చిత్తూరు జిల్లా తాగునీటి అవసరాలంటూ కండలేరు నుంచి 7.5 టీఎంసీల నీటిని తరలించేందుకు సుమారు రూ.7 వేల కోట్లతో పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. అయితే మిగులు జలాలపై ఆధాపడి చేపట్టిన ఈ ప్రాజెక్టులన్నింటి పాలిట రాష్ట్ర విభజన తీవ్ర ప్రభావం చూపుతోంది. బ్రిజేష్ తీర్పుతో ఆల్మట్టి డ్యాం ఎత్తు మరింత పెరిగితే మన ప్రాంతానికి మిగులు జలాలు రావడం ప్రశ్నార్ధకం కానుండ గా, ఎగువన కృష్ణానదిపై మరికొన్ని ప్రాజెక్టులు నిర్మించాలన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో దిగువకు నీరు వచ్చే పరిస్థితి ఉండదు. ఫలితంగా కృష్ణ జలాలు జిల్లాకు రాక రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవచూపి దిగువ రాష్ట్రం, ప్రాంతాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top