రుణ మాఫీ కోసం ఉద్యమించాలి

రుణ మాఫీ కోసం ఉద్యమించాలి - Sakshi


చోడవరం : రైతు, డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో మోసంచేసిన టీడీపీ ప్రభుత్వ విధానంపై పోరాటానికి సిద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు. ఇక్కడి జవహార్ క్లబ్‌లో  నియోకవర్గం స్థాయి పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. నాలుగు మండలాల నుంచి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తొలుత వైఎస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

 

అనంతరం గణపతిరాజు రాంబాబురాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు తమ సమస్యలను, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ధర్మశ్రీ మాట్లాడుతూ రుణమాఫీ అంటూ అధికారంలోకి వచ్చిన టీడీపీ దానిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు, మహిళలకు న్యాయం కోసం ప్రతిపక్షపార్టీగా వైఎస్సార్‌సీపీ పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు. ఈనెల 7న పీఏసీఎస్ అధ్యక్షులతో చోడవరంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించి ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు.

 

టీడీపీ దౌర్జన్యాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఎటువంటి ఆపదవచ్చినా అండగా ఉంటానని ప్రకటించారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతున్న వైఎస్ జగన్‌మోహనరెడ్డి గొంతునొక్కేందుకు టీడీపీ యత్నించడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు వెంపలి ఆనందీశ్వరరావు, నాగులాపల్లి రాంబాబు, పినబోయిన అప్పారావుయాదవ్, శెట్టి సత్యనారాయణ, కంచిపాటి జగన్నాథరావు, అప్పికొండ లింగబాబు, ఏడువాక సత్యారావు, అల్లం రామఅప్పారావు, తమరాన రమణ, పందల దేవ పాల్గొన్నారు.

 

రైతులపై లాఠీఛార్జీ సీఎంకు తగదు

అనకాపల్లి టౌన్ : బకాయిలు అడిగిన చెరకు రైతులపై లాఠీఛార్జి చేయించడం సీఎం చంద్రబాబుకు తగదని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ. బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు పెంటకోట జగన్నాథంలు మండిపడ్డారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  విజయనగరం జిల్లా సీతానగరంలోని ఎన్‌సీఎస్ చక్కెరమిల్లుకు గతేడాది చెరకు సరఫరా చేసిన రైతులకు యాజమాన్యం సుమారు రూ.25 కోట్లు బకాయి పడిందన్నారు.

 

ఆరు నెలలుగా అన్నదాతలు ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. విసుగుచెందిన రైతులు మంగళవారం శాంతియుతంగా ఆందోళన చేస్తే సమస్య పరిష్కరించాల్సిందిపోయి పారిశ్రామిక వేత్తలకు తొత్తుగా వ్యవహరిస్తున్న సీఎం అమాయక రైతులపై లాఠీఛార్జి చేయించడం అమానుషమన్నారు. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతాంగ వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలన్నారు. ఇందుకు కారకులైన పోలీసు అధికారులపైనా, ఫ్యాక్టరీ యాజమాన్యంపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

జీవో 181లోనూ లోపాలు

తుమ్మపాల : రుణమాఫీ రైతులందరికీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ. బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి పి. జగన్నాథం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీఐటీయూ కార్యాలయంలో విలేకర్లతో మంగళవారం మాట్లాడారు.  రుణమాఫీ కోసం జారీ చేసిన జీవో 181లో షరతుల వల్ల పలువురు రైతులు అనర్హులుగా మిగిలిపోతున్నారన్నారు. ఇందులోనూ సవరణలు చేపట్టాలన్నారు.

 

పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ లేదా రుణ అర్హత కార్డు ఉంటేనే మాఫీ వర్తిస్తుందనే నిబంధనను తొలగించాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌తో రుణమాఫీ ముడిపెట్టవద్దని, రైతు మిత్ర, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, ఎల్‌ఈసీ ద్వారా తీసుకొనే రుణాలను కూడా పంట రుణాలుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఉద్యానవన పంటలకు, వ్యవసాయ అనుబంధమైన సన్న, చిన్నకారు రైతులకు ఇచ్చిన డెయిరీ, గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపలు తదితరులపై ఇచ్చిన రుణాలను కూడా మాఫీ చేయాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top