ఏజెన్సీలో బదిలీలకు పచ్చజెండా

ఏజెన్సీలో బదిలీలకు పచ్చజెండా - Sakshi

  •  23వ తేదీలోగా దరఖాస్తుల స్వీకరణ

  •  28 నుంచి కౌన్సెలింగ్

  •  ఐటీడీఏ పీవో వినయ్‌చంద్

  • పాడేరు: పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర, నాలుగో తరగతి సిబ్బంది బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీల కౌన్సెలింగ్ చేపడుతున్నామన్నారు. ఒకే చోట మూడేళ్లు పనిచేసే ఉపాధ్యాయులు బదిలీకి అర్హులన్నారు. ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నవారికి బదిలీ తప్పదన్నారు.



    ఒకే చోటు పనిచేస్తున్న ఉపాధ్యాయేతర, నాలుగో తరగతి ఉద్యోగులు బదిలీకి అర్హులని, ఐదేళ్లు పైబడిన వారు విధిగా బదిలీ కావాల్సిందేనన్నారు. లోకాయుక్త ఉత్తర్వుల మేరకు బాలికల ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న 50 ఏళ్ల లోపు పురుష ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారిని బాలుర పాఠశాలలకు బదిలీ చేస్తామని, వారిస్థానంలో బాలుర ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయులను నియమిస్తామన్నారు.



    బాలికల ఆశ్రమ పాఠశాలలో ఖాళీలకు తగు సంఖ్యలో మహిళా టీచర్లు అందుబాటులో లేకుంటే గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న మహిళా టీచర్లకు అవకాశం కలిపిస్తామన్నారు. అన్ని కేడర్‌ల సిబ్బంది బదిలీలకు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, కేడర్‌వారీ నమూనా జాబితాలు, ఖాళీల వివరాల ప్రకటన, అభ్యంతరాల స్వీకరణను 24వ తేదీన చేపడతామన్నారు. పరిశీలన అనంతరం జాబితాను 26న ప్రకటిస్తామని, 27న తుదిజాబితా ఉంటుందన్నారు.



    బదిలీల కౌన్సెలింగ్‌కు నాలుగో తరగతి ఉద్యోగులు (అటెండరు,కుక్,కమాటీ,వాచ్‌మెన్)లకు , నాన్‌టీచింగ్ ఉద్యోగులు (జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, హెచ్‌డబ్ల్యూవో)లకు 28వ తేదీన, పీజీ హెచ్ ఎం, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, లాగ్వేంజ్ పండిట్‌లకు 29న, ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక పాఠశాలలోని ఎస్‌జీటీలకు 30న కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. దరఖాస్తులను గిరిజన సంక్షేమ డీడీ కార్యాలయం నుంచి పొందాలని అలాగే అన్ని స్కూల్ కాంప్లెక్స్‌ల హెచ్‌ఎంలు, హెచ్‌డబ్ల్యూవోలు బదిలీల కౌన్సెలింగ్‌పై తమ పరిధిలో పని చేస్తున్న వారందరికి తెలియజేయాలన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top