స్వార్థంతోనే వ్యతిరేకిస్తున్నారు

స్వార్థంతోనే వ్యతిరేకిస్తున్నారు - Sakshi


హైదరాబాద్: రాజధాని వస్తే భూముల ధరలు పెరుగుతాయని, అప్పుడు ఎక్కువ ధరలకు అమ్ముకుని లబ్ధి పొందొచ్చన్న స్వార్థంతోనే కొందరు రైతులు భూసమీకరణను వ్యతిరేకిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు.  గురువారం జపాన్ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. 'ఏ ఒక్క రైతునూ బెదిరించలేదే.. ప్రజాస్వామ్యంలో బెదిరించడం సాధ్యమా' అని అన్నారు. 'రాజధాని నిర్మాణానికి రైతులే స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. రేపు అక్కడ రాజధాని వచ్చిన తర్వాత వాళ్లు వ్యవసాయం చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో కమ్యూనిస్టులు, వైఎస్సార్‌సీపీ నేతలు పర్యటించి.. భూములు ఇవ్వొద్దని రైతులకు సూచించినా.. వారు వినలేదన్నారు 'రాజధాని నిర్మాణానికి 1,000 ఎకరాలు చాలునని కమ్యూనిస్టులు చెబుతున్నారు.. వారి పార్టీ కార్యాలయాల కోసం పదెకరాల భూమి అవసరమా?' అని ప్రశ్నించారు.



భూములు ఇవ్వడానికి నిరాకరిస్తోన్న రైతులు సైతం రాజధాని ఆ ప్రాంతంలోనే కావాలంటున్నారని వివరించారు. వ్యవసాయం చేస్తే ఆదాయం రాదని.. ఓ పరిశ్రమో.. ఓ నాలుగు లేన్ల రహదారినో నిర్మిస్తే వస్తుందన్నారు. భూముల విలువ పెరగాలంటే రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వంపై విశ్వాసంతోనే జపాన్ ప్రభుత్వం తొలిసారిగా ఓ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదర్చుకుందన్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టాక జపాన్, సింగపూర్, దావోస్‌లలో వందలాది మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యానని.. ఇటీవల ముంబైకి కూడా వెళ్లానని వివరించారు. జపాన్ కంపెనీలకు చెందిన వంద మంది ప్రతినిధులతో గురువారం సమావేశమయ్యానని.. పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జూన్ ఆఖరునాటికి సింగపూర్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను అందిస్తుందని.. ఓ ఏజెన్సీని కూడా నియమిస్తుందని తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం నియమించే ఏజెన్సీతో కలసి రాజధాని ప్రాంతంలో ఎక్కడ పరిపాలన భవనాలు నిర్మించాలి?.. ఎక్కడ పరిశ్రమలను ఏర్పాటుచేయాలి? ఎక్కడ రోడ్లు వేయాలి? ఎక్కడ నివాస గృహాలను నిర్మించాలనే విషయాన్ని నిర్ణయిస్తామని వివరించారు.  



ఆయనేమన్నారో నాకు తెలీదు

రాజధాని భూసేకరణపై జనసేన నేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఏం మాట్లాడారో తనకు తెలియదనీ  ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధానిని నిర్మించాల్సిన అవసరం ఉందని  చెప్పారు.



పవన్  వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించొద్దు

పవన్ కల్యాణ్ వ్యాఖ్యల విషయంలో తీవ్రస్థాయిలో స్పందించకూడదని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు  నేతలను ఆదేశించారు. ఈ విషయంలో తీవ్రంగా స్పందించొద్దంటూ పార్టీ కార్యాలయం నుంచి నేతలకు సమాచారం పంపించారు.



రాష్ట్రాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చేయండి

ఇక్కడి సహజ వనరులకు సాంకేతిక సహకారాన్ని జోడించి రాష్ట్రాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చేయాలని జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆగ్నేయాసియాకు తమ రాష్ట్రం గేట్‌వే, లాజిస్టిక్ హబ్‌గా ఉందన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో గురువారం  సీఎం జపాన్ పారిశ్రామికవేత్తలతోసమావేశమయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top