మళ్లీ రూటు మారిన వరద కాలువ

మళ్లీ రూటు మారిన వరద కాలువ - Sakshi


- అలైన్‌మెంట్ మార్పుతో నత్తనడకన వరద కాలువ నిర్మాణం

- మరోసారి మార్చడంపై తీవ్ర అభ్యంతరాలు

- ప్రోద్దుటూరు రైల్వేస్టేషన్ సమీపం నుంచి వెళ్లనున్న కాలువ  

- రాజకీయ ఎత్తుగడే కారణం

ప్రొద్దుటూరు : 
అలైన్‌మెంట్ మార్చిన కారణంగా ముందుకు సాగని కుందూ-పెన్నా వరద కాలువ నిర్మాణం మరో మారు చిక్కుల్లో పడనుంది. తాజాగా మరో మారు అలైన్‌మెంట్ మార్పుతో పనులు కొనసాగడంపై అనుమానాలు రేకెత్తిస్తోంది. పనులు 2007లో ప్రారంభించినా ఇంత వరకు అతిగతీ లేకుండా పోయింది. త్వరితగతిన పనులు పూర్తి చేసి తమకు తాగు నీరు ఇవ్వండని పట్టణ ప్రజలు ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు.



ఈ నేపథ్యంలో అధికార పార్టీ సీనియర్ నేత వేసిన రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఉన్నతాధికారులు మరో మారు అలైన్‌మెంట్ మార్చారు. ఈ కారణంగా పనుల నిర్మాణానికి సంబంధించి భూ యజమానులు, ప్లాట్ల వ్యాపారుల నుంచి మళ్లీ వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.



ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. ప్రొద్దుటూరు పట్టణ ప్రజల శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.72 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో పెద్దముడియం మండలం నాగరాజుపల్లె వద్ద కుందూ-పెన్నా వరద కాలువ నిర్మాణానికి ఉన్నతాధికారులు అలైన్‌మెంట్ రూపొందించారు. అయితే ఈపీసీ పద్ధతిలో కాంట్రాక్టు పనులు చేపట్టిన సీనియర్ నేత అలైన్‌మెంట్‌ను మార్చి తనకు అనుకూలంగా చేసుకున్నాడు. ఇందులో భాగంగా రాజుపాళెం మండలంలోని పర్లపాడు గ్రామంలో అప్పటి టీడీపీ వర్గీయులైన వారి పంట పొలాల్లోంచి కాలువ వెళ్లేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ గ్రామస్తులు ఎన్నో సందర్భాల్లో బహిరంగంగానే ఈ విషయాలను వెల్లడించారు.



కోర్టులో కేసులు కూడా వేశారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన సీనియర్ నేత ఎలాగైనా పనులు చేపట్టాలనే వ్యూహంతో ఉన్నారు. ఇందులో భాగంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును సైతం స్వయంగా పర్లపాడులో ఇదివరకు తన ప్రత్యర్థులుగా ఉన్న వారి ఇంటికి తీసుకెళ్లారు. ఎదో రకంగా వారితో రాజీ కుదుర్చుకుని కోర్టులో కేసులను విత్‌డ్రా చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదే తరహాలో ప్రొద్దుటూరుతోపాటు మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన వారు కూడా కోర్టును ఆశ్రయించారు. ప్లాట్లు వేసిన, ఇళ్ల నిర్మాణానికి అనువైన తమ భూములు, స్థలాల్లో ఉద్దేశ పూర్వకంగా కాలువ నిర్మిస్తున్నారని అప్పట్లో వారు పేర్కొన్నారు. అయితే గత ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతంలో ఈ సమస్యతో సీనియర్ నేతకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.



ఈ కారణంగానే ఆయన కొత్తపేట గ్రామంలో ఇల్లిల్లూ తిరిగి మీ భూములు పోకుండా కాలువను మార్చుతానని బయటికి పొక్కకుండా గ్రామస్తులకు హామీ ఇచ్చారు. స్వయంగా ఆ గ్రామస్తులే ఈ విషయాన్ని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం కుందూ-పెన్నా కాలువ నిర్మాణానికి సంబంధించి తాజాగా అలైన్‌మెంట్‌ను మార్చారు. మొత్తం కాలువ నిర్మాణం 35 కిలోమీటర్లు కాగా ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న రైల్వే క్వార్టర్స్ సమీప ప్రాంతంలో నుంచి అలైన్‌మెంట్‌ను మార్చారు. మొత్తం 35 కిలోమీటర్లు కాలువను నిర్మించాల్సి ఉండగా 33.925 కిలోమీటర్ నుంచి 35వ కిలోమీటర్ వరకు అలైన్‌మెంట్‌ను మార్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.



ఈ మార్పు వల్ల కాలువ నిర్మాణ పనులు మళ్లీ వివాదాస్పదం కానున్నాయి. ప్రస్తుతం అలైన్‌మెంట్ మార్చిన ప్రకారం ఇంకా ప్రారంభానికి నోచుకోని ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్, రైల్వే క్వార్టర్స్ పరిధిలోనే కాలువ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. క్వార్టర్స్ ప్రహరీ నిర్మాణం వరకు ప్రస్తుతం నీటి పారుదల శాఖాధికారులు జెండాలు పాతారు. ఈ ప్రాంతమంతా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది. దీంతోపాటు ఇక్కడ కూడా చాలా మంది ప్లాట్ల యజమానులు, రైతులు నష్టపోనున్నారు. అసలు రెండో అలైన్‌మెంట్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

నానాటికి పెరుగుతున్న అంచనా వ్యయం

పనుల జాప్యం కారణంగా కుందూ-పెన్నా కాలువ నిర్మాణ వ్యయం నానాటికి పెరుగుతోంది. 2007లో కాలువ నిర్మాణానికి మొత్తం రూ.72కోట్లతో టెండర్లు పిలిచారు. మధ్యలో పనులు ఆగిపోయిన తర్వాత మళ్లీ అంచనాలను రివైజ్డ్ చేసి ఆ మొత్తాన్ని రూ.183 కోట్లకు పెంచారు. ప్రస్తుతం మార్చిన అలైన్‌మెంట్ ప్రకారం ఇంకా అంచనా వ్యయం పెరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top