మళ్లీ నిరాశే


స్పష్టత లేని బడ్జెట్

 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2015-16 రైల్వే బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టత లేదు. ఏప్రాజెక్టుకు ఎంత ఇస్తారో.. ఏ జిల్లాకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారో స్పష్టం చేయలేదు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపు పూర్తి స్థాయిలో స్పష్టం చేయాలి. 45 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న కర్నూలు-మంత్రాలయం రైల్వే లైను నిర్మించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. కోచ్ ఫ్యాక్టరీకి నిధులిచ్చి కరువు జిల్లాలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. ఇతర పెండింగ్ ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి.

 - బుట్టా రేణుక, కర్నూలు ఎంపీ

 

 కర్నూలు (రాజ్‌విహార్): జిల్లా ప్రజల మొరను ‘ప్రభు’ ఆలకించలేదు. దశాబ్దాల తరబడి జరుగుతున్న అన్యాయంపై కరుణ చూపలేదు. పాతికకు పైగా డిమాండ్లు ఆయన ముందు ఉంచినా ఒక్కటి తప్ప దేనినీ ఒప్పుకోలేదు. రూ.2 వేల కోట్లు అవసరమని అభ్యర్థిస్తే కేవలం రూ.130 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇతర పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. నూతన మార్గాలు కావాలన్నా వినిపించుకోలేదు. వర్క్‌షాపు నిర్మాణానికి నిధులివ్వలేదు. కొత్త రైళ్లు కావాలని కోరినా ఒప్పుకోలేదు. ఒకటా రెండా.. ఏ డిమాండ్‌ను అంగీకరించలేదు. రైల్వే బడ్జెట్‌లో మళ్లీ జిల్లాకు నిరాశే మిగిలింది.

 

 ‘‘ రైల్వే బడ్జెట్‌లో ప్రతిసారి మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోంది. ఇందులో మనకు తగిన న్యాయం జరిగి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కేంద్ర మంత్రివర్గంలో మన రాష్ట్రానికి రైల్వే శాఖ మంత్రి పదవిని దక్కించుకోవాలి. అప్పుడే మన అభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని రైల్వే బడ్జెట్‌లలో రాష్ట్రానికి అన్యాయం జరిగిన సందర్భాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదనతో చెప్పిన మాటలివి.

 

 ‘బీజేపీకి మద్దతిచ్చి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు మౌనంగా ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యత లభించినా నోరు మెదపడం లేదు. రైల్వే రంగంలో వెనుకబడి రాష్ట్ర విభజనతో పూర్తిగా నష్టపోయిన అంధ్రప్రదేశ్‌కు ప్రయోజనాలు చేకూరకపోయినా పట్టించుకోవడం లేదు. రాయలసీమలో అత్యంత వెనుకబడినకర్నూలు జిల్లాకు అన్యాయం జరుగుతున్నా ఉప ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న టీడీపీ నేతలు మౌనంగా ఉన్నారు.

 

 2015-16 రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు మరోసారి అన్యాయం జరిగింది. గురువారం పార్లమెంటు సమావేశాల్లో రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు సరైన కేటాయింపులు చేయలేదు. పెండింగ్ ప్రాజెక్టుల్లో నంద్యాల ఎర్రగుంట్ల లైనుకు రూ.130కోట్లు ఇస్తామని ప్రకటించారు తప్ప ఇతర ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. వర్క్‌షాపు నిర్మాణం, మంత్రాలయం కొత్త రైలు మార్గానికి పట్టిన గ్రహణం వీడలేదు. జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతికి రూ.2 వేల కోట్లు కావాల్సి ఉండగా రూ.130 కోట్లు ప్రకటించిన సరిపెట్టారు.

 

 విదిల్చింది రూ.130 కోట్లే

 దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న  కడప జిల్లా ఎర్రగుంట్ల - బనగానపల్లె- నంద్యాల లైను పనులకు రూ.130 కోట్లు ఇస్తామనిప్రకటించారు. ఈ రైలు మార్గం ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూ.60 కోట్ల బిల్లులు చెల్లించలేదు. పెండింగ్‌లో ఉన్న 20 కిలోమీటర్ల మేరకు (నంద్యాల క్రాస్‌లైన్ వెంకటేశ్వరపురం వరకు) పనులు పూర్తి చేసేందుకు, అసంపూర్తిగా ఉన్న బనగానపల్లె, కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ల పనుల పూర్తికి రూ.70 కోట్లు అవసరం అవుతాయి. మొత్తం రూ.150 కోట్లు కేటాయిస్తే పూర్తి స్థాయిలో పనులు జరిగేవి, కాని రూ.130 కోట్లే ఇచ్చారు.

 

 మంత్రాలయం లైను నిర్మించాలి

 కర్నూలు నుంచి కోడుమూరు మీదుగా ఎమ్మిగనూరు, మంత్రాలయం వరకు కొత్త రైల్వే లైను ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రం నుంచి పశ్చిమ ప్రాంతానికి రవాణ వ్యవస్థ స్తబ్దుగా ఉంది. ఈ రైలు మార్గం ఏర్పాటుతో రవాణా కష్టాలు తీరుతాయి. కరువు ప్రాంతంలో వ్యాపార, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి.

 - బి. షేక్షావలి, ప్యాలకుర్తి

 

 ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కనువిప్పు కలగలేదు

 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూశాక కూడా కేంద్రానికి కనువిప్పు కలగలేదు.  కొత్త రైలు ఏదీ వేయలేదు. కనీసం మన రాష్ట్ర రాజధాని విజయవాడకు రైలు వేయకుండా సామాన్య ప్రజలపై భారం మోపారు. బెంగుళూరు, విజయవాడలకు కర్నూలు నుంచి రైలు నడపాలి. ప్యాసింజర్ రైలూ నడపాలి. రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కేంద్రంతో పోరాడి కొత్త రైళ్లను సాధించుకోవాలి. ఎన్నో ఆశలతో ఎదురుచూసిన రైల్వే బడ్జెట్ నిరాశ కల్గించింది.

 - ఎం.ఎస్. చంద్రశేఖర్,

 మయూరి హైట్స్ ట్రెజరర్

 

 వర్క్‌షాపు నిర్మాణానికి నిధులివ్వాలి

 జిల్లా కేంద్రంలో రైల్వే వర్క్‌షాపు నిర్మాణానికి నిధులు కేటాయించాలి. చదువుకున్న ఎంతో మంది యవకులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. వర్క్‌షాపు, ఇతర ప్రాజెక్టులను నిర్మిస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.

 - అక్బర్ సాహెబ్, లెక్చరర్, నందికొట్కూరు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top