ఇంట్లో..కత్తులు

ఇంట్లో..కత్తులు - Sakshi

  •     దెబ్బతీస్తున్న ప్యాకేజీ వ్యూహం

  •      అభ్యర్థులకు అసంతృప్తుల కష్టాలు

  •      పార్టీల్లోకి పరస్పర వలసలు

  •       పోలింగ్‌కు ముందు కొత్త రాజకీయం

  •  సాక్షి ప్రతినిధి, వరంగల్ : సార్వత్రిక ఎన్నికల్లో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయోగిస్తున్న వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. ప్యాకేజీ రాజకీయాలు కలిసొస్తాయని భావించిన నేతలకు భంగపాటు ఎదురవుతోంది. సొంత పార్టీ నాయకుల నుంచి అసంతృప్తి సెగ తాకుతుండడం.. వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. గెలుపు వ్యూహాల్లో భాగంగా ప్రత్యర్థి పార్టీల శ్రేణులను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్యాకేజీ రాజకీయాలకు తెర తీసిన విషయం బహిరంగ రహస్యమే.



    తమకు ప్రత్యర్థులుగా ఉన్న వారిని దగ్గరకు తీస్తుండడాన్ని సొంత పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేశామని, తమ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థి పార్టీల వారిని అక్కున చేర్చుకోవడంపై మండిపడుతున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు సైతం ఇలాగే ప్యాకేజీ వ్యూహం అమలు చేస్తుండడంతో కొందరు బహిరంగంగానే గోడ దూకుతున్నారు. మరికొందరు మరికొందరు సొంత పార్టీలోనే ఉండి అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.



    ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న నేతలు  పరస్పరం పార్టీలు మారినప్పటికీ ప్రత్యర్థులుగానే ఉంటున్నారు. ఇది గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుండడంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. అనుచర వర్గంలో ఎవరిని నమ్మాలో తెలియక తికమకపడుతున్నారు. అలాగని... అందరినీ అనుమానించి ఎన్నికల సమయంలో దూరం చేసుకోలేపోతున్నారు.

         

    మహబూబాబాద్ అసెంబ్లీకి సంబంధించి విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌లో మొదటి నుంచి గ్రూపులు ఎక్కువ. ఇటీవల కేసముద్రంలో కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు ఏకంగా కొట్లాటకు దిగాయి. ప్రత్యర్థి పార్టీలకు సహకరించేది మీరంటే మీరంటూ ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఏకంగా కొట్టుకున్నారు. ఇదే నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నేత ఒకరు టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని గులాబీ పార్టీలోని సీనియర్ నేతలు వ్యతిరేకించారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారనే కోపంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు కొందరు కాంగ్రెస్ నుంచి వచ్చిన కొత్త నేతను కొట్టినంత పని చేశారు.

         

    జనగామ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన కొత్త, పాత నేతల మధ్య ఆగ్రహావేశాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.  రెండు రోజుల క్రితం బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ఎన్.ఇంద్రసేనారెడ్డి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఈ పరిస్థితి చోటుచేసుకుంది. కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వైఖరికి నిరసనగా మొదటి నుంచి పార్టీలో ఉన్న కమలనాథులు బహిరంగంగానే నిరసనకు దిగారు.

         

    పరకాల టీఆర్‌ఎస్‌లోనూ రెండు వర్గాల మధ్య సమన్వయం విషయంలో ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇటీవల జరిగిన సమావేశంలో కొత్త, పాత నేతల మధ్య ఉన్న అంతరం ఏకంగా ఘర్షణ రూపంలో బయటపడింది.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top