2040 అంతరిక్ష పరిశోధనలో భాగస్వామినవుతా..

2040 అంతరిక్ష పరిశోధనలో భాగస్వామినవుతా..


– నాసా సదస్సులో విశేష ప్రతిభ





ఆసక్తి, కృషి ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు అనడానికి నిదర్శనమే తిరుపతికి చెందిన పదో తరగతి విద్యార్థి పసుపులేటి రెడ్డి రాఘవ సుమిరన్‌ ఆదిత్య. పరిశోధన రంగంలో తనకున్న ఆసక్తికి తోడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడి ప్రోత్సాహం తోడు కావడంతో నాసా సదస్సులో పాల్గొనే అర్హత సాధించాడు. ఆ సదస్సులో పెద్దపెద్ద ప్రొఫెసర్లే ఆశ్చర్యపడేలా ఆదిత్య ప్రతిభ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. నాసా కాన్ఫరెన్స్‌ నుంచి తిరుగొచ్చిన ఆదిత్యను ‘సాక్షి’ పలకరించింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..



తిరుపతి తుడా : 2040లో అమెరికా అంతరిక్ష పరిశోధనలో భాగస్వామ్యం కావడమే నా ముందున్న లక్ష్యం. నాసా ప్రతియేటా నిర్వహించే అంతరిక్ష సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ గల విద్యార్థులను ఆహ్వానిస్తుంది. 36వ నేషనల్‌ స్పేస్‌ డెవలప్‌మెంట్‌ కాన్ఫరెన్స్‌కు ఎంపికై అంతరిక్షంలో భవన నిర్మాణం–స్థితిగతులు అనే అంశంపై ప్రదర్శన ఇచ్చాను. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) 2040లో అంతరిక్షంపై నివాస గృహాల ఏర్పాటే లక్ష్యంగా పనిచేయనుంది. ఇందుకోసం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ విద్యార్ధుల వరకు నాసా కాన్ఫరెన్స్‌కు పరిశోధన పత్రాలను ఆహ్వానించింది.



ప్రపంచ వ్యాప్తంగా 400 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరు మాత్రమే ఎంపికై ప్రజెంటేషన్‌ ఇచ్చాం. ప్లెథోరా అనే పేరుతో అంతరిక్షంపై 70వేల మంది నివసించే భవన నిర్మాణ నమూనా.. నివసించే వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు.. ఆక్సిజన్‌ వంటి వాటిని ఎలా సంగ్రహించాలనే దానిపై సంపూర్ణ వివరాలతో కూడిన పత్రాలు సమర్పించాం. వాటిని పరిశీలించిన నాసా ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆల్‌గ్లోబల్స్‌ తమ పరిశోధన పత్రానికి ఆమోదం తెలిపి, సదస్సుకు ఎంపిక చేశారు. ఐదు రోజుల సదస్సులో అంతరిక్షానికి సంబంధించిన అనేక అంశాలపై లోతుగా విశ్లేషణ చేశారు.



ఆ అంశాలను అవగతం చేసుకున్నాను. నా లక్ష్యానికి నాసా సదస్సు వేదికగా భావిస్తున్నా.. అంతరిక్ష పరిశోధనలంటే నాకు అమితాసక్తి.. 2018–19 నాసా సదస్సుకు ఎంపికైతే అంతరిక్ష పరిశోధనలకు అవకాశం కల్పిస్తుంది. నాసా తలపెట్టిన అంతరిక్షంపై నివాస ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలన్నదే నా లక్ష్యం. అందుకోసం అంతరిక్ష పరిశోధన పత్రాలను రూపొందించబోతున్నా. స్పేస్‌ రంగాన్ని ఎంచుకోవడానికి నా తల్లిదండ్రులు పసుపులేటి శివప్రసాద్, కిరణ్మయిలతో పాటు టీచర్‌ రాజశేఖర్‌ నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే వారు. వారి ప్రోత్సాహంతో అంతరిక్ష పరిశోధన రంగంలో అడుగుపెడుతానన్న నమ్మకం నాకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top