అడిగేవారెవరు!

అడిగేవారెవరు!


ఇసుకాసురుల అడ్డా పంచలింగాల

 అధికార పార్టీ కనుసన్నల్లో ఇసుక మాఫియా చెలరేగుతోంది. తుంగభద్ర నదీ తీరం ఛిద్రమవుతోంది. చర్యలకు అధికారులు వెనుకంజ వేస్తుండగా.. అనుమతి లేకపోయినా ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. అడ్డుకునేందుకు కమిటీ ఏర్పాటైనా.. అక్రమార్కులకు సహకరించారనే ఆరోపణలతో పలువురిని బదిలీ చేసినా.. మామూళ్ల మత్తుకు చట్టం చుట్టమవుతోంది.

 

 కర్నూలు రూరల్: తుంగభద్ర నదీ తరంలోని ఇసుక అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారుతోంది. కర్నూలు మండల పరిధిలోని పంచలింగాల గ్రామ సమీపం నుంచి ఇసుక తరలింపునకు అడ్డుకట్ట వేసే నాథుడే కరువయ్యాడు. వాల్టా చట్టం ప్రకారం ఇసుక తవ్వకాలకు పది శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే ఎలాంటి అనుమతి లేకపోయినా ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటిపోతున్నా అధికారులు గుడ్లప్పగించి చూస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగుతున్న దందా కావడంతో తమకెందుకనే ధోరణి కనిపిస్తోంది. ఏడాదిన్నర క్రితం ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో.. ఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రత్యేక టీములు ఏర్పాటయ్యాయి. ఆరోపణలపై ఏడుగురు వీఆర్వోలను జిల్లా సరిహద్దు ప్రాంతాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత కూడా అక్రమ తరలింపులో ఏమాత్రం మార్పు రాకపోవడం అధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. అధికారంలోకి రాకమునుపు టీడీపీ ముఖ్య నేత ఒకరు ఇసుక మాఫియాపై విచారణకు డిమాండ్ చేశారు. ఇసుకాసురుల వివరాలు తమ వద్ద ఉన్నాయని.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే ఇసుక తరలింపులో కీలకభూమిక పోషిస్తుండటం గమనార్హం. పైగా తన మనుషులను అడ్డుకుంటే బదిలీలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తుండటం ‘పచ్చ’ రాజకీయానికి నిదర్శనం. గత కలెక్టర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ అనుకుని ఉన్న దేవమాడ, పూడూరు గ్రామాల్లో ఇసుక తవ్వకాలకు అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత బెదిరింపులకు తలొగ్గి ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులకు పచ్చజెండా ఊపేశారు. రాయల్టీ బాధ్యతను ఎస్‌ఆర్‌బీసీ అధికారులకు కట్టబెట్టారు. రెండు నెలల క్రితం కోర్టు ఆదేశాలతో రాయల్టీ జారీ నిలిచిపోయింది. ఇటీవల ఆ బాధ్యతను కేసీ కెనాల్ ఈఈకి అప్పగించారు. ప్రభుత్వ శాఖల పురోగతి.. అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహిస్తున్న జిల్లా అధికారులు సైతం.. ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పంచలింగాల గ్రామం కేంద్రంగా అధికార పార్టీ నేత కుటుంబ సభ్యుడు ఏకంగా అక్కడే ఓ ఇంటిని బాడుగకు తీసుకుని ఇసుక తరలిస్తూ లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నాడు. గతంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన ఓ అధికారి సైతం ఇప్పుడు నోరు మెదపని పరిస్థితి. ఇసుక తరలింపునకు భారీ వాహనాలను వినియోగిస్తుండటంతో ఆ గ్రామానికి నీరు సరఫరా చేస్తున్న పైపులైన్ తరచూ పగిలిపోతుండటం తాగునీటి ఇక్కట్లకు కారణమవుతోంది. అయినప్పటికీ సదరు నేతకు భయపడి పంచాయతీ అధికారులు, స్థానిక గ్రామ పెద్దలు ఫిర్యాదుకు వెనుకంజ వేస్తున్నారు. మరి జిల్లా అధికారులు ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేస్తారో.. మాఫియాకు తలొంచుతారో వేచి చూడాలి.







 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top