ఇచ్చిన బాకీ తిరిగి రాలేదని..

ఇచ్చిన బాకీ తిరిగి రాలేదని.. - Sakshi


అద్దంకి: ఇచ్చిన బాకీ తిరిగి రాలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు 60 అడుగుల ఎత్తున 33 కిలోవాట్ల విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణ శివార్లలోని మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రహదారిలో శింగరకొండ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఎదురుగా ఆదివారం జరిగింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో నివశిస్తున్న పెట్లూరి వెంకటరెడ్డికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. మూడో కుమారుడు ఆదిరెడ్డి (22) ఏడో తరగతి వరకు చదువుకుని బడిమానేశాడు.



విజయవాడలోని ఓ పళ్ల దుకాణంలో కొన్నేళ్లు..ఆ తరువాత అద్దంకి పట్టణంలోని ఓ వాటర్ ప్లాంటులో రెండేళ్లు పనిచేశాడు. ప్లాంటు యజమానికి *2 లక్షల అప్పు ఇంటి నుంచి తెచ్చి ఇచ్చాడు. ఇటీవల అప్పు వసూలు విషయంలో యజమానికి.. తనకు పడకపోవడంతో అక్కడ పని మానేశాడు. శింగరకొండ రహదారిలో ఉన్న ఓ దాబాలో బాయ్‌గా చేరాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆదిరెడ్డిని గతంలో పనిచేసిన వాటర్ ప్లాంట్‌లో పనిచేసే ఇద్దరు స్నేహితులు వచ్చి సినిమాకు పిలిచారు. దాబా ఓనర్ వద్ద అనుమతి తీసుకుని సినిమాకు వెళ్లాడు. సినిమా చూసి రాత్రి 11గంటల సమయంలో దాబా వద్దకు చేరుకున్నాడు.



ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెల్లవారే సరికి యువకుడు అరవై అడుగుల విద్యుత్ టవర్‌పై శవమై కనిపించాడు. దాబా సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకు వారు బహిర్భూమికి బయటకు రావడంతో అద్దంకి నుంచి మండలంలోని కుంకుపాడులో ఉన్న కల్లం స్పిన్నింగ్ మిల్‌కు వెళ్లే 33 కిలోవాల్టుల కెపాసిటీ ఉన్న 60 అడుగుల విద్యుత్ టవర్‌పై ఓ యువకుని శవాన్ని గమనించిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.



ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సాంబశివరావు, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు వివరాలు సేకరించారు.యువకుడు వేసుకున్న చొక్కా..తల వెంట్రుకలు బూడిదై కింద రాలిపడ్డాయి. సంతమాగులూరు నుంచి క్రేన్ తెప్పించి రెండు గంటల అనంతరం ఇద్దరు యువకులు టవర్ ఎక్కి ఇనుప గిలక కట్టి మోకు సాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.



ఇచ్చిన అప్పు రాకపోవడమే మృతికి కారణం...

తాను 2 లక్షల అప్పు ఇచ్చిన యజమాని ఎన్నిసార్లు అడిగినా డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది, ఇంట్లో డబ్బు ఏదని అడుగుతుండడంతో బాధ భరించలేక ఆదిరెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. విచారణ నిర్వహించి పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top