నాకే అడ్డుపడతావా..!

నాకే అడ్డుపడతావా..! - Sakshi


సాక్షి ప్రతినిధి, కడప:

 మల్లేల లింగారెడ్డి. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అధికారులను దూషించి వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడ్డారు.  ఎమ్మెల్యే పదవిపోయాక అధికార పార్టీ నాయకుడిగా జిల్లా యంత్రాం గంపై జులుం ప్రదర్శిస్తున్నారు. తాజాగా ట్రాన్స్‌కో ఎస్‌ఈపై బూతుపురాణం అందుకున్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌నాయుడు సాక్షిగా జిల్లా ఉన్నతాధికారిని తీవ్రంగా దూషించిన  ఘటన

 

 నాకే అడ్డుపడతావా..!


 ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రొద్దుటూరు పట్టణ ప్రజల దాహార్తి కోసం మైలవరం దక్షిణ కాలువ ద్వారా విడుదల చేసిన నీటికి సోమవారం రైతులు గండ్లు కొట్టారు. ఈవిషయమై ఎంపీ రమేష్, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి గత సోమవారం  పోట్లదుర్తిలో సీఎంరమేష్ ఇంట్లో  సమాలోచనలు  చేశారు. అదే సమయంలో ఎంపీ రమేష్ పిలిపించడంతో పోట్లదుర్తికి ట్రాన్స్‌కో ఎస్‌ఈ గంగయ్య వెళ్లారు. ఎస్‌ఈని చూడగానే మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి చిర్రెత్తుకొచ్చింది.



సీఎండీ విద్యాసాగర్‌రెడ్డి పేరు చెబుతూ ఎస్‌ఈ గంగ య్యపై బూతు పురాణం అందుకున్నారు. పత్రికల్లో వాడలేని పదజాలంతో చెలరేగిపోయారు.   ఒక దశలో  అందుబాటులో ఉన్న బూటును చేతికి తీసుకున్నట్లు సమాచారం.  లింగారెడ్డి చర్యలకు నిర్ఘాంతపోయిన ఎస్‌ఈ గంగయ్య తేరుకుని అదేస్థాయిలో తిరగబడ్డట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నామని.. మీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ తీవ్రస్థాయిలో  ఎదురుతిరిగినట్లు  తెలుస్తోంది.



  లింగారెడ్డి వీరంగం వెనుక....

 ప్రొద్దుటూరు పట్టణం శ్రీనివాసనగర్‌లో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గీయుల నేతృత్వంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. పట్టణ ప్రజల విద్యుత్ అవసరాల రీత్యా ఆప్రాంతంలో సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టాల్సి  వచ్చింది.  అందుకుగాను ప్రభుత్వ స్థలంలోని 13సెంట్లలో  రూ.1.2కోట్లతో సబ్‌స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆమేరకు పనులు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తర్వులున్నాయి. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సబ్‌స్టేషన్లను  సత్వరమే నిర్మించాలని అందిన ఆదేశాల మేరకు శ్రీనివాసనగర్‌లో నిర్మాణం చేపట్టారు.



ఆస్థలంలో సబ్‌స్టేషన్ నిర్మించరాదని  లింగారెడ్డి ఎప్పటినుంచో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనిచేసిన సీఎండీ విద్యాసాగర్‌రెడ్డితో సైతం పలుమార్లు విభేదించారు. ఎట్టకేలకు ఆస్థలంలో సబ్‌స్టేషన్ నిర్మాణం  చేపట్టారు.   ఈ నేపథ్యంలో  ట్రాన్స్‌కో ఎస్‌ఈ గంగయ్య కన్పించగానే లింగారెడ్డి తిట్ల దండకం  అందుకున్నారు.  నోటికి వచ్చినట్లు దూషించడమే కాకుండా, విచక్షణ మరిచి ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన బూటును చేతికి తీసుకున్నట్లు తెలుస్తోంది.  జిల్లా స్థాయి ఉన్నతాధికారిపై లింగారెడ్డి ఇష్టారాజ్యంగా  ప్రవర్తిస్తున్నా ఎంపీ సీఎం రమేష్ నిలువరించలేకపోయారు. లింగారెడ్డి వైఖరిపై నిర్ఘాంతపోయిన అనంతరం తేరుకున్న ఎస్‌ఈ గంగయ్య ఎదురుతిరిగినట్లు సమాచారం.



చేతనైతే ట్రాన్స్‌ఫర్ చేయించుకో.. లేదంటే స్థలం మీదేనని ప్రభుత్వ ఉత్తర్వులు కానీ, కోర్టు ఉత్తర్వులు కానీ చూపించు.. మరీ కాదంటే ఉన్నతాధికారుల ద్వారా నిలిపివేయించు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని తిరగబడినట్లు సమాచారం.



 కలెక్టర్ ఆదేశాలు మేరకే నిర్మిస్తున్నాం: ఎస్‌ఈ గంగయ్య

      జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకే శ్రీనివాసనగర్‌లో సబ్‌సేష్టన్ నిర్మిస్తున్నామని ఎస్‌ఈ గంగయ్య ఁసాక్షి ప్రతినిధి*కి వివరించారు.  స్థలం తనదంటూ ఎలాంటి పత్రాలు లేకుండా మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి అడ్డుకుంటున్నారన్నారు. కోర్టు ద్వారా ఉత్తర్వులున్నాయంటారని అయితే చూపించరన్నారు. ఆకారణంగా నోటికి వచ్చినట్లు దూషించి  ఇష్టారాజ్యంగా ప్రవర్తించారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకుండా అడ్డుకోవడం తగదన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top