ఎన్టీఆర్ దర్శకత్వంలో సీతగా నటించా

ఎన్టీఆర్ దర్శకత్వంలో సీతగా నటించా - Sakshi


రాజమండ్రి కల్చరల్ : ‘రాజమండ్రి నాకు పుట్టిల్లులాంటిది. పరిశ్రమలో నాకు ఓ గుర్తింపు తీసుకువచ్చిన బాపు, రమణల సినిమాలన్నీ ఈ జిల్లాలోనే రూపుదిద్దుకున్నాయి’ అని అలనాటి మేటి సినీ నటి సంగీత అన్నారు. రాజమండ్రి రావడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. స్థానిక ఆనం కళాకేంద్రంలో రాయుడు ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న బాపు, రమణీయం కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన సందర్భంగా ఆమె నాటి-నేటి సినీరంగ పోకడలపై ‘సాక్షి’తో ముచ్చటించారు. వివరాలు ఆమె మాటల్లోనే..

 

 ముత్యాలముగ్గు నాకు నచ్చిన సినిమా




 తొలిసారిగా నేను నటించిన సినిమా ‘తీర్పు’. అయినా, ముందుగా విడుదలయిన సినిమా ‘ముత్యాలముగ్గు’. వ్యాపార ప్రకటనల కోసం స్టిల్ ఫొటోగ్రాఫర్ భూషణ్ తీసిన నా ఫొటోలను బాపుగారికి చూపించడం, ఆయన ఓకే అనడం జరిగిపోయింది. ఇప్పటికీ నాకు నచ్చిన సినిమా ముత్యాలముగ్గే. బాపు అప్పటికే సినీ దర్శకునిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మితభాషి. ఆయనతో మాట్లాడాలంటే కొంత బెదురుగా ఉండేది. అయితే, కాగితంపై బొమ్మలతో ఆయన తాను అనుకున్న దృశ్యాన్ని వివరించేవారు. ఇక ముళ్ళపూడి వెంకట రమణగారు చాలా సరదాగా ఉండేవారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా భాషల్లో ఇప్పటివరకూ సుమారు 500 సినిమాల్లో నటించాను.

 

 ఎన్టీఆర్ దర్శకత్వంలో సీతగా నటించా




 మహానటుడు ఎన్టీ రామారావు నుంచి ఒక రోజు ఫోన్ వచ్చింది. ‘అమ్మా రేపు రాగలవా’ అన్నారు. ఎగిరి గంతేశాను. మర్నాడు ఆయన్ను కలిశాను. తాను నిర్మించి, దర్శకత్వం వహిస్తున్న శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో సీతగా నటించాలన్నారు.  ‘నిన్న కలలో నీవు కనపడ్డావు. సీత పాత్ర నీదే’ అన్నారు. అసలు ముందుగా హేమమాలినిని అనుకున్నామన్నారు. ఆ సినిమాలో ఆయన శ్రీరామునిగా, రావణునిగా రెండు పాత్రలు చేశారు. ఎప్పుడూ రాముడు లేదా రావణుడు పాత్రల్లో కనిపించేవారు. దర్శకునిగా మామూలుగా ఎప్పుడూ చూడలేదు. దేవీపట్నంలో తెల్లవారుజామున 2.30 గంటలకు మేకప్ చేయించారు. 5.30 గంటలకు మొదటి షాట్ తీశారు. నా అభిమాన నటీనటులు వైజయంతిమాల, ధర్మేంద్ర. నా భర్త సుందర్‌రాజన్ దర్శకత్వంలో పది సినిమాలు చేశాను.

 

 నేడు డబ్బే ప్రధానం




 ఇప్పుడు స్పీడ్ పెరిగింది. ఆ రోజుల్లో నిర్మాత వస్తే- నా పాత్ర ఏమిటని అడిగేవాళ్లం. ఇప్పుడు ఎన్ని డేట్లు కావాలి? ఎన్ని కోట్లు ఇస్తారు? అని అడుగుతున్నారు. డబ్బే ప్రధానమైంది. వ్యాంప్ పాత్రల అవసరం లేదు. హీరోయిన్లే ఆ పాత్రలు ధరిస్తున్నారు. చిత్తశుద్ధి తగ్గిపోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top