నిర్లక్ష్యంగా పనిచేస్తే చర్యలు తప్పవు

నిర్లక్ష్యంగా పనిచేస్తే చర్యలు తప్పవు


కళ్యాణదుర్గం రూరల్ :

 విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. సోమవారం ఆయన కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు ఉన్నారా లేక వ్యాపారాలు చేసుకోవడానికి వస్తున్నారా? అని అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఇలాగే విధులు నిర్వహిస్తే ఇబ్బందులకు గురికాకతప్పదని హెచ్చరించారు. ఆస్పత్రిలోని ప్రతి విభాగాన్ని ఆయన తనిఖీ చేశారు.



మందులు పంపిణీ చేసే గదిని పరిశీలించారు. రోగుల పేరు నమోదుకు రఫ్‌బుక్ ఏర్పాటు చేయడం పై ఎస్‌పీహెచ్‌ఓ పురుషోత్తం, మెడికల్ అధికారి రాజేంద్రప్రసాద్, ఫార్మసిస్ట్ మీనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల చిరునామాను సక్రమంగా సమోదు చేయలేకపోతే.. ఇక విధులు ఏ తరహాలో నిర్వహిస్తున్నారో అర్థమవుతోందన్నారు.  రోజుకు ఎంత మంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారు? ఎందరికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారని డాక్టర్ అనితను ప్రశ్నించారు.  



ఏఏ రోగాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరా తీశారు. డాక్టర్ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల విధి నిర్వహణ సక్రమంగా లేదని డీఎంఅండ్ హెచ్‌ఓ రామసుబ్బారావుకు సూచించారు. అనంతరం దంత వైద్యశాలను పరిశీలించారు. అక్కడి స్థితి గతులపై డాక్టర్ సతీస్‌కుమార్‌ను ప్రశ్నించారు.



నిబంధనల మేరకు రికార్డులు లేకపోవడంతో డాక్టర్ పనితీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారానికోసారి విధులకు వస్తున్నారా? అని ప్రశ్నించారు. గత ఏడాది రికార్డులు చూపాలని అడిగారు. ఆ రికార్డులు డీఎంహెచ్‌ఓ వద్ద ఉన్నాయని డాక్టర్ సమాధానమిస్తుండగా  దంతవైద్య అధికారిని వెంటనే సస్పండ్‌ను చేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు.



 అనంతరం ల్యాబ్, సీమాంక్ కేంద్రం, బ్లెడ్ బ్యాంక్, వార్డులను పరిశీలించారు. అక్కడ చికిత్స రోగులతో సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. బాలింతలకు మెరుగైన సేవలు అందుతున్నాయా లేదానని ప్రశ్నించారు. హెచ్‌ఐవీ కేసుల విషయంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, వారికి మందులు పంపిణీ, దిన చర్యలను ఎలా పర్యవేక్షిస్తున్నారని ఆరా తీశారు.  



రికార్డులు సక్రమంగా లేకపోవడంతో సంబంధిత అధికారులపై మండిపడ్డారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే వ్యవస్త అస్తవ్యస్తంగా తయారైందని అసహనం వ్యక్తం చేశారు. ఆయనతో  పాటు అడిషనల్ డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డీసీహెచ్‌ఓ రామకృష్ణ, తదితర అధికారులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top