డీఎస్పీ, సీఐలపై చర్యలకు ఆదేశం


చార్జిషీటు చదవకుండా కోర్టుకు పంపించారని అదనపు జిల్లా జడ్జి వ్యాఖ్య

నరసాపురం(రాయపేట) : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ, సీఐలపై తగు చర్యలు తీసుకోవాలని అదనపు జిల్లా న్యాయస్థానం పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి.కల్యాణరావు సోమవారం తీర్పు చెప్పారు. గతంలో పాల కొల్లు సీఐ, ప్రస్తుతం విజయవాడ డీటీఎస్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జె.సీతారామస్వామి, అప్పటి ఎస్సై, ప్రస్తుతం పాలకొల్లు రూరల్ సీఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌పై తగు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి.



నరసాపురం డీఎస్పీ కార్యాలయ పరిధిలోని మొగల్తూరు పోలీసు స్టేషన్‌లో క్రైమ్ నంబరు 129/2009 కేసుకు సంబంధించి సెక్షన్ 302, 201 ఐపీసీ ప్రకారం జూలై 8, 2009లో కేసు నమోదు చేశారు. అప్పటి పాలకొల్లు సీఐ సీతారామస్వామి విచారణ అధికారిగా పని చేశారు. కేసు విషయంలో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పరిశోధన చాలా సాధారణంగా ఉందని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని కొత్త సవరణలను పాటించకుండా, ఒక లేఖరి యాంత్రికంగా తయారు చేసిన చార్జిషీటును న్యాయపరంగా సరిపోయిందా లేదా అని చూడ కుండా.. కనీసం చదవకుండా కోర్టుకు దాఖలు చేయడం విధినిర్వహణలో అలసత్వంగా భావిస్తున్నట్లు తీర్పులో అదనపు జిల్లా సెషన్స్ జడ్డి పేర్కొన్నారు.



శాస్త్రీయ పద్ధతులను సద్వినియోగం చేసుకోకుండా, సమన్లు అందుకున్న అధికారులు సకాలంలో న్యాయస్థానానికి హాజరు కాకపోవడంతో అధికారులపై దురహంకారం, అమర్యాద, ఉల్లంఘన, విధి నిర్వహణలో లోపాలు, సత్వర విచారణ జరపటంలో ఆటంకపర్చి న్యాయస్థానానికి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు, నిందితుని తరపు న్యాయవాదికి ఇబ్బందులు కలగజేశారని పేర్కొ న్నారు. కేసు విచారణ త్వరితగతిన ముగించేం దుకు, నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించేందుకు, న్యాయస్థానం ఆదేశాల మేరకు సాక్షులను ఆయా తేదీల్లో ప్రవేశపెట్టేందుకు సీఐ ఆసక్తి చూపలేదన్నారు.



దీనివల్ల న్యాయస్థానానికి, న్యాయవాదులకు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఇబ్బం దికర పరిస్థితులు కలిగాయని పేర్కొన్నారు. సీఐ అహంకారం, న్యాయస్థానం ఆదేశాల ఉల్లంఘన, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా భావించి తగు చర్యలకు ఆదేశించినట్టు తీర్పులో వెల్లడించారు. హత్య, మానభంగం, దొంగనోట్లు తదితర నేరాల పరిశోధనలో నాణ్యమైన ప్రమాణాలను పాటించాలని, లేనిపక్షంలో నేర పరిశోధన వ్యవస్థ అంతిమ తీర్పు ఇవ్వడంలో విఫలమవుతుందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top