ధనలక్ష్మి కేసులో నిందితులు అరెస్టు


బంటుమిల్లి : బంటుమిల్లికి చెందిన యామర్తి లక్ష్మీనారాయణ రెండో కుమార్తె వై.ధనలక్ష్మి మృతి కేసులో కుటుంబసభ్యులతో పాటు పలువురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 22వ తేదీ రాత్రి ధనలక్ష్మి అనుమానాస్పదంగా మృతి చెందింది. 23వ తేదీ తెల్లవారుజామున  కుటుంబసభ్యులు పలువురి సహకారంతో దహనం చేశారు. దీనిపై 26వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు.



వారం రోజుల పాటు దర్యాప్తు జరిపి ధనలక్ష్మి తండ్రి యామర్తి లక్ష్మీనారాయణ, అన్న సత్యన్నారాయణలతోపాటు మృతురాలి ప్రియుడు మద్దాల చిరంజీవి, ఆటో డ్రైవరు ఆకునూరు వీర వెంకటేశ్వరరావు, శ్మశానానికి వెళ్లిన పోసిన మోహన్‌రావు, మద్దిపూడి కోటేశ్వరరావు, పొదిలి వెంకటేశ్వరరావును అరెస్టు చేసి విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు.

 

ఈ సందర్భంగా బందరు రూరల్ సీఐ ఎస్.వి.మూర్తి మాట్లాడుతూ చదువుకునే సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడిందన్నారు. ఈ విషయం తెలిసిన చిరంజీవి పెద్దలు 2004లో మరో యువతితో వివాహం జరిపించారని తెలిపారు. ఆ తర్వాత కూడా ధనలక్ష్మి, చిరంజీవి వ్యవహారంపై గ్రామ పెద్దలు రాజీ చర్చలు జరిపినట్లు చెప్పారు. ధనలక్ష్మికి 2012లో గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిపారన్నారు. ధనలక్ష్మికి వివాహం అయిన తర్వాత కూడా చిరంజీవి వేధింపులకు గురి చేసినట్లు తెలిపారు. దీంతో ధనలక్ష్మి కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయని, ఈ విషయం విడాకుల వరకు వచ్చిందని చెప్పారు.

 

చిరంజీవి వేధింపులు తాళలేక ధనలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు మొదటి ముద్దాయిగా చిరంజీవిపై ఐపిసి 306 చట్టం నమోదు చేశామన్నారు. మిగిలిన వారిపైన 201 కేసు పెట్టినట్లు తెలిపారు. అనంతరం నిందితులను బంటుమిల్లి జూనియర్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఎస్‌ఐ చిర ంజీవి సిబ్బంది పాల్గొన్నారు. పోలీసుల దర్యాప్తుపై  స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top