ఏసీబీ వలలో ‘సాగునీటి’ చేప

ఏసీబీ వలలో ‘సాగునీటి’ చేప - Sakshi

  •     రూ. 10వేలు లంచం తీసుకుంటూ దొరికిన డ్రాఫ్ట్స్‌మెన్

  •      అరెస్టు చేసి రిమాండుకు తరలించాం: డీఎస్పీ

  • విశాఖపట్నం: కల్వర్టు నిర్మాణ పనులు పొడిగింపు నిమిత్తం లంచం తీసుకుంటూ సాగునీటి విభాగానికి చెందిన ఓ సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ ఏసీబీ వలలో చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ నరసింహరావు తెలిపిన వివరాల ప్రకారం... సివిల్ కాంట్రాక్టరు పూడి వెంకటేశ్వరరావు అనకాపల్లి మండలంలో గండిపడిన ఎరికివానిపాలెం చెరువుకు కల్వర్టు నిర్మించేందుకు రూ. 4.50 లక్షలకు టెండరు తీసుకున్నారు.



    వర్షాల కారణంగా చెరువులో నీరు చేరడంతో సకాలంలో పనులు పూర్తి కాలేదు. వాటిని పూర్తి చేయడానికి గడువు పొడిగింపు (ఏవోటీ) కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి వర్క్‌స్లిప్ సాంక్షన్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఈఈ) ఈ ఏడాది మార్చిలో ఆయా పనులు పరిశీలించారు. దీంతో లక్ష రూపాయల అంచనాతో వెంకటేశ్వరరావు వర్కుస్లిప్ తయారు చేసి నగరంలోని జిల్లా పరిషత్తు సమీపంలోనున్న సాగునీటి శాఖ కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే ఆ వర్కు స్లిప్ మంజూరుకు రూ. 15 వేలు ఇవ్వాలని అక్కడి సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ బొడ్డేపల్లి విజయ్‌కుమార్ డిమాండ్ చేశాడు.



    అలాగే ఈఈకి కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. రూ. 10 వేలు ఇచ్చేందుకు వెంకటేశ్వరరావు అంగీకరించారు. తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం ఉదయం వెంకటేశ్వరరావు నుంచి సాగునీటి శాఖ కార్యాలయంలో విజయ్‌కుమార్ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా, అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ నరసింహరావు, సిబ్బంది రామకృష్ణ, రమణమూర్తి, గణేష్ దాడి చేసి పట్టుకున్నారు. ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

     

    కేజీహెచ్ ట్రామాకేర్ కేసులో...

     

    కేజీహెచ్‌లో రోగి నుంచి రూ. 20 వేలు డిమాండ్ చేసిన వ్యవహారంలోనూ త్వరలోనే దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడైన డాక్టరును అరెస్టు చేస్తామని డీఎస్పీ నరసింహరావు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడి తలకు స్కానింగ్ చేసేందుకు కేజీహెచ్ ట్రామాకేర్ యూనిట్ డాక్టర్ జి.రామకృష్ణ రూ. 20వేలకు ఒప్పందం కుదుర్చుకున్న వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. క్షతగాత్రుడి కుటుంబసభ్యుడు చిత్రీకరించిన వీడియోను పరిశీలించామని, వాటిని ల్యాబ్‌కు పంపిస్తే నిజ నిర్ధారణ అయ్యిందని డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసును ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, నిందితుడైన డాక్టర్ రామకృష్ణు త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top