ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్


రూ. 1500 లంచం తీసుకుంటుండగా పట్టివేత

 కడప అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సురేష్ బుధవారం రూ. 1500 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన వివరాలను ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి మీడియాకు వివరించారు. కడప నగరానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి ఫర్మ్ రిజిస్ట్రేషన్ కోసం మీ-సేవలో దరఖాస్తు చేసుకున్నాడన్నారు.

 

 రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంబంధిత ఉద్యోగులు  నిర్లక్ష్యం ప్రదర్శించారన్నారు. సీనియర్ అసిస్టెంట్ సురేష్‌ను సంప్రదించగా రూ. 2 వేలు ఇస్తే ఫర్మ్ రిజిస్ట్రేషన్ వెంటనే చేయిస్తానని తెలిపారన్నారు. దీంతో నాగేంద్ర తమను ఆశ్రయించడంతో  వల పన్నామన్నారు. సురేష్‌కు నాగేంద్ర డబ్బు ఇవ్వగానే దాడి చేశామన్నారు. ఈ సంఘటనలో తనతోపాటు సీఐలు పార్థసారథిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డి, చంద్రశేఖర్, రామ్‌కిశోర్ సిబ్బంది పాల్గొన్నారన్నారు. నిందితుడిని అరెస్టు చేశామని, గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top