జీతాలు ఇవ్వండి మహాప్రభో..


నెల్లూరు (అర్బన్) : ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పాలన అస్తవ్యస్తంగా సాగుతోందనే ఆరోపణలున్నాయి. జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చిందని అందరూ సంబరపడుతున్నా ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు మాత్రం ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. కళాశాలలో పాలన పూర్తిగా గాడి తప్పడంతో ఇక్కడ పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఇబ్బందులు తప్పడంలేదు. డీఎంఈ (డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) పరిధిలో పనిచేస్తున్న డాక్టర్లకు, సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రాకపోవడమే ఇందుకు నిదర్శనం. కళాశాల్లో అడ్మినిస్ట్రేషన్ విభాగం సరిగ్గా పనిచేయడంలేదనే విమర్శలున్నాయి.



అధికారిక వర్గాల సమాచారం ప్రకారం కళాశాలలో 120 మంది వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డాక్టర్లు పనిచేస్తున్నారు. వీరిలో కొందరికి మూడు నెలలు, మరికొందరికి నాలుగు నెలల జీతాలు రావాల్సి ఉంది. అలాగే డీఎంఈ పరిధిలో 193 మంది స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు, క్లరికల్ స్టాఫ్, శానిటరీ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కొత్తగా తీసుకున్న సుమారు 16 మంది సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. వీరికి ఏ ప్రాతిపదికన జీతాలు చెల్లించాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.



అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది వైఫల్యం?

కళాశాలలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది బిల్స్‌ను సకాలంలో ఇవ్వని కారణంగానే జీతాలు రాలేదని ఆరోపణలున్నాయి. జీతం కోసం సంబంధిత సిబ్బందిని అడిగితే మీరు ఇన్‌కంట్యాక్స్ ఫామ్స్ సరిగ్గా ఇవ్వలేదని అన్నారని, సరిదిద్ది ఇచ్చినా ఇప్పటి వరకు జీతాలు రాలేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్‌ను అడిగితే అడ్మినిస్ట్రేషన్ సిబ్బందిని అడగాలని చెబుతున్నారని, వాళ్లేమో బిల్లులు చేస్తున్నాం అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారే తప్ప జీతాలు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రస్తుతం ఒక డాక్టర్ ఏడీ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆయన తన విధులు చూసుకుంటూ ఇవి చేయాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా ఎంసీఏ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) బృందం కళాశాలను తనిఖీ చేసి వెళ్లింది. ఈ బృంద సభ్యులు కూడా జీతాలు ఇంకా ఎందుకు చెల్లించలేదని కళాశాల అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది.



అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌కు వర్క్ తెలియదు: డాక్టర్ ఎన్ ప్రభాకర్‌రావు, ప్రిన్సిపల్, ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాల

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌కు పని గురించి తెలియకపోవడంతోనే జీతాలు రావడం ఆలస్యమవుతోంది. ప్రొఫెసర్లు యూజీసీ స్కేల్‌లో ఉండడంతో వారికి శాలరీ ఎలా రాయాలనేవిషయం సిబ్బందికి తెలియదు. రెండు సార్లు శాలరీ బిల్స్ రాసి పంపినా వెనక్కు వచ్చాయి. త్వరలోనే సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తాం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top