డాక్టర్ గారూ.. ఆరోగ్యసిరికి అనారోగ్యం!

డాక్టర్ గారూ.. ఆరోగ్యసిరికి అనారోగ్యం! - Sakshi


సంక్షేమాన్ని ప్రజలకు అందించడం, రాజ్యం కోసం సంపద సృష్టించడం కొందరు దార్శనికులకే సాధ్యం. తన ప్రభుత్వ హయాంలో సంక్షేమం, సంపద అనే రెండు పడవలపై ప్రయాణించి.. ప్రజల గుండెల్లో గొప్ప దార్శనికుడుగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిలిచారు. తన ప్రభుత్వ హయాంలో అభివృధ్దితోపాటు పలు సంక్షేమ పథకాలను కొనసాగించి దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు వైఎస్ఆర్ మార్గదర్శకుడయ్యారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఏకైక లక్ష్యంతో ఆరోగ్యశ్రీని ప్రారంభించారు. వైద్యుడిగా పేదల కష్టాలను ప్రత్యక్షంగా చూసి.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చారు. వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాల్లో ఆరోగ్యశ్రీ పథకం కోట్లాది మందికి స్ఫూర్తినివ్వడమే కాకుండా భరోసా కూడా ఇచ్చింది.



ఎంతోమందికి ప్రాణదాతగా మారిన వైఎస్ఆర్ను భగవంతుడు తనవద్దకు పిలుచుకుని.. ప్రజలను శోకసంద్రంలో ముంచెత్తాడు. రాజన్న కనుమరుగైన తర్వాత అదను కోసం ఎదురు చూస్తున్న శక్తులు తమ విశ్వరూపం చూపాయి. రాష్ట్రాన్ని విచ్చిన్నం చేశాయి. మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తే.. ఇక ప్రజల హృదయాల్లో స్థానం కోల్పోతామోననే భయంతో ఒక్కొక్కటిగా పేదలకు పథకాలను దూరం చేశారు. పేదల ఆరోగ్యం గురించి ఆలోచించి ఆయన ప్రారంభించిన 108, ఆరోగ్య శ్రీతో పాటు అనేక పథకాలను నీరుగార్చారు. మహానేత మరణం తర్వాత ఆరోగ్యసిరి కనిపించకుండా పోయింది. పేద ప్రజలకు వైద్యం ఓ కలగానే మిగిలిపోయింది.



ప్రజలకు ఎంతో ధీమానిచ్చిన ఉచిత కార్పొరేట్ వైద్యం ఒకప్పటి ఘనతగానే మిగిలింది. రాజన్నలేని రాజ్యం అన్ని రకాలుగా విచ్చిన్నమైంది. రైతులు, నేతన్నలు, మహిళలు అనాధలుగా మారారు. తమ కష్టాలను కడతేర్చడానికి రాజన్నే రావాలని పేద ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మళ్లీ రాజన్న రాజ్యం వస్తే బాగుండని ప్రతి గుండే కోరుకుంటోంది... వస్తావా రాజన్న..  మళ్లీ మాకోసం!!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top