ఉచితానికి ‘ఆధార్’ షాక్

ఉచితానికి ‘ఆధార్’ షాక్ - Sakshi


తాడేపల్లిగూడెం :పూర్తిగా బోర్లపై ఆధారపడి సాగే మెట్ట వ్యవసాయం ఒకప్పుడు అస్సలు గిట్టుబాటయ్యేది కాదు. రైతుకు ఏటేటా అప్పుల భారం పెరిగిపోయేది. ఉన్న పొలం అమ్ముకొని ఊరొదిలి పోదామంటే కొనే నాథుడుండేవాడు కాదు. బిల్లులు కట్టమని రోజూ ఇళ్లకు వచ్చి విద్యుత్ శాఖ సిబ్బంది అడుగుతుంటే పుస్తెలతాళ్లు అమ్మి బిల్లులు చెల్లించిన ఉదంతాలున్నాయి. బిల్లులు కట్టకుంటే సామాన్లు బయటకు గిరాటేసి ఇళ్లకు తాళాలు వేసిన దృశాలు.. 2004కు ముందు మెట్ట ప్రాంతాలలో తరచుగా కనిపించేవి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా అధికారం చేపట్టిన తొలిరోజున చేసిన సంతకంతో.. రైతులకు ఉచిత విద్యుత్, పాత బకాయిల రద్దయ్యాయి. దీంతో నేలతల్లిని నమ్మి ఆరుగాలం శ్రమించిన రైతులు ఒడ్డున పడ్డారు. ఆయన చేసిన సంతకంతో బంజరు భూములు బంగరు భూములయ్యాయి.

 

 ఉచిత విద్యుత్ పుణ్యాన పంటలతో వ్యవసాయ క్షేత్రాలు కళకళలాడాయి. వేల రూపాయలకు మించి ఎకరం కొనని పరిస్థితి నుంచి మెట్టలో ఎకరా భూమి రూ.లక్షలకు చేరింది. రైతుల బిడ్డలు నేలతల్లి ద్వారా వచ్చిన ఆదాయంతో ఉన్నత విద్యను అభ్యసించగలిగారు. ప్రస్తుత ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు, ఆధార్‌కు లింకు పెట్టే ప్రయత్నాలు చేయడంతో మెట్ట ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యమైన విద్యుత్ అందకపోవడంతో ఇప్పటికే రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ వ్యవహారం ప్రహసనంగా మారిన నేపథ్యం. మరోపక్క దోమపోటు వంటి సమస్యల విషవలయంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయాధారం పోతుందని ఆందోళన చెందుతున్నారు. బోరు లేకుండా మెట్టలో వ్యవసాయం చేయడం కష్టం. ఉచిత విద్యుత్ లేకపోతే, భూములను వైఎస్ పాలనకు ముందు మాదిరి బీడుగా ఉంచుకోవాలేమోననే బాధను రైతులు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ బతికుంటే తమకీ కష్టాలు ఉండేవి కావని ఆయన పాలనను తలచుకుంటున్నారు.

 

 గూడెం ప్రాంతంలో 10 వేల మంది రైతుల పరిస్థితి అయోమయం

 తాడేపల్లిగూడెం ఎలక్ట్రిక ల్ డివిజన్ పరిధిలో ఉచిత విద్యుత్ పొందే రైతులు 10318 మంది ఉన్నారు. ఆధార్ లింకు వ్యవహారంతో వీరు ఆందోళన చెందుతున్నారు. ఈ నిబంధనను సాకుగా చూపి కరెంటు కనెక్షన్ తీసివేస్తారేమోనని మదనపడుతున్నారు. పేరుకు ఉచిత కరెంటు అని చెబుతున్నా, ైరె తుల వద్ద నుంచి నిర్వహణా ఖర్చుల పేరుతో ఒక్కొక్క కనెక్షన్ నుంచి ఆరు నెలలకు ఒకసారి 180 రూపాయలు ప్రభుత్వం వసూలు చేస్తోంది. చేసిన వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబానికే సరిపోవడంతో ఈ నిర్వహణ ఖర్చులు కూడా రైతులు చెల్లించలేకపోతున్నారు. తాడేపల్లిగూడెం డివిజన్‌లో 10318 కనెక్షన్‌ల ద్వారా నిర్వహణ ఖర్చుల బకాయి 72 లక్షల 82 వేల 553 రూపాయలు ఉందంటే.. ఉచిత విద్యుత్ పొందుతున్నా రైతు పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు. ఇలాంటి పరిస్థితులలో ఆధార్ లింకు పెట్టి ఉచిత విద్యుత్‌కు మంగళం పాడితే మా గతి ఏంటంటున్నారు.

 

 65 లక్షల యూనిట్లకు మంగళమేనా

 గూడెం ఎలక్ట్రికల్ డివిజన్ పరిధిలో ఉన్న 10318 కనెక్షన్‌లకు ఉచిత విద్యుత్ తీసివేస్తే... రెండున్నర ఎకరాల లోపు పొలం కలిగిన చిన్నకారు రైతులు ఇదే కనెక్షన్ల కింద బోర్లు వాడితే నెలకు సుమారు 65 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్‌కు 50 పైసలు చార్జీలుగా వసూలు చేయాలి. ఈ లెక్కన చూసుకుంటే ఒక్క గూడెం ప్రాంతంలోనే రూ. 32.5 లక్షల విద్యుత్ భారం రైతుల నెత్తిన పడనుంది. అలాకాకుండా ఐదెకరాల పొలం ఉన్న రైతులు ఈ కనెక్షన్లలో ఉంటే వారిని కార్పొరేట్ రైతులుగా పరిగణిస్తారు. యూనిట్‌కు రెండున్నర రూపాయల వంతున బిల్లులు వసూలు చేస్తారని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

 

 రైతుల నడ్డి విరిచే విధానం మార్చుకోవాలి

 రైతుల నడ్డి విరిచే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ విరమించు కోవాలి. నమ్మకంతో రైతులు అధికారాన్ని కట్టబెడితే ఏవిధంగా ఉచిత విద్యుత్‌ను ఎగ్గొట్టాలి అనే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఇలాంటి విధానం మార్చుకోకపోతే రైతులు ఆందోళన చేపడతారు.  

 - గంధం బసవయ్య, మాధవరం, రైతు

 

 ఇది మంచిది కాదు

 ఆధార్ ఉంటేనే ఉచిత విద్యుత్ అనే విధానం మంచిది కాదు. గత ప్రభుత్వాలు ఎటువంటి నిబంధనలు విధించకుండా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేవి. ఇప్పుడు ఎలా ఎగ్గొట్టాలా అనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విధానాన్ని మార్చుకోవాలి. - ర్యాలి నాగు, జగన్నాధపురం, రైతు

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top