తెలంగాణలో ఇక పరేషనేనా!

తెలంగాణలో ఇక పరేషనేనా!

నిన్నటి దాకా ఆధార్ నిరాధారమన్నారు. ఇప్పుడు మళ్లీ రేషన్ కి ఆధార్ కి తెలంగాణ ప్రభుత్వం ముడి పెట్టింది. ఇప్పటి వరకు ఆధార్‌ నెంబర్‌ లేని తెల్ల రేషన్‌ కార్డుదారులు ఇకపై రేషన్‌ పొందాలంటే  కష్టమే. 

 

ఆధార్‌ నెంబర్‌ ఇవ్వని తెల్లకార్డుదారులకు రేషన్‌ సరఫరా ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు పౌరసరఫరాల శాఖ నుంచి  జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. 

 

కార్డులెక్కువ, కుటుంబాలు తక్కువః ఉన్న కుటుంబాలకంటే రేషన్‌కార్డులు ఎక్కువగా ఉన్నాయని, అందులో భారీగా బోగస్‌ కార్డులు ఉన్నాయని, అదే స్థాయిలో సంక్షేమ పథకాల్లో అవినీతి జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.తెలంగాణలో కుటుంబాల కంటే రేషన్‌ కార్డులెక్కువంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. పౌరసరఫరాల శాఖ లెక్కల ప్రకారం తెలంగాణలో రేషన్‌ కార్డుల సంఖ్య 1.47 కోట్లు. ఇందులో తెల్లకార్డుల సంఖ్య  91.94 లక్షలు. గులాబీ కార్డుల సంఖ్య15.07 లక్షలు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జారీ చేసిన అంత్యోదయ కార్డుల సంఖ్య 41 లక్షలు. కార్డులు కుటుంబాలతో పోల్చితే కార్డులు దాదాపు  22 లక్షలు ఎక్కువున్నాయి. ఇవన్నీ బోగస్‌ కార్డులే అన్నది ప్రభుత్వం వాదన. బోగస్‌ కార్డులను వెలికిదీస్తే  దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుతాయని అంచనా.   

 

కొత్త కార్డులు కావాలి బాబూ! ఇవన్నీ చాలవన్నట్టు ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో కొత్త రేషన్‌ కార్డులు కావాలనే దరఖాస్తులు వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ప్రకటించిన పెన్షన్ల మొత్తం భారీ  పెంపు, రెండు బెడ్‌ రూమ్‌ల ఇళ్లు పథకాలే. తెల్ల రేషన్‌ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వస్తాయని భావిస్తున్న ప్రజలు వాటి కోసం అప్లయ్‌ చేస్తున్నారు. దీంతో తమను కాపాడేందుకు ఆధారే ఆధారమని తెలంగాణ సర్కారు భావిస్తోంది. 

 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top