నూరుశాతం ఆధార్‌తో అనుసంధానం చేయాలి


 ఒంగోలు టౌన్ :  జిల్లాలోని పట్టాదారు పాస్ పుస్తకాలను రెండు మూడు రోజుల్లో నూరుశాతం ఆధార్‌తో అనుసంధానం చేయాలని జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ ఆదేశించారు. గురువారం ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఒంగోలు డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, సర్వేయర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.



 పట్టాదారు పాస్ పుస్తకాలను ఆధార్‌తో అనుసంధానం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే తహశీల్దార్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకనుంచి ఈ-పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. ఎక్కడైనా మ్యాన్యువల్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటే వెంటనే వాటిని ఈ-పట్టాదారు పాస్ పుస్తకాలుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.



కొత్తపట్నం, చినగంజాం మండలాల్లో గ్రామానికి ఒకటి చొప్పున 1-బీలు ఉండాల్సి ఉండగా, రెండు మూడు ఉన్నాయని, వాటిని సమగ్రంగా విచారించాలని ఆదేశించారు. కొంతమంది రైతులు గ్రామాల్లో ఉండకపోవడంతో ఆధార్ అనుసంధానంలో జాప్యం జరుగుతోందని జాయింట్ కలెక్టర్ దృష్టికి తహశీల్దార్లు తీసుకురాగా వారంతా వచ్చేవిధంగా చొరవచూపాలని సూచించారు. సర్వే నంబర్లు కనిపించకుండా ఉన్నా వాటిపై కూడా విచారించాలన్నారు. కౌలు రైతులందరికీ రుణ అర్హత కార్డులు అందించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.



 ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున సకాలంలో రుణ అర్హత కార్డులు అందించడం వల్ల కొంతమేర కౌలు రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మండలాల వారీగా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు లక్ష్యాలు కేటాయించామని, వాటి ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అక్టోబర్ మొదటి వారంలో పండుగలు ఉన్నందు న వాటికి ముందుగానే చౌకధరల దుకాణాల నుంచి నిత్యావసరాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.



డీలర్లు సకాలంలో డీడీలు చెల్లించే విధంగా చూడటంతో పాటు సరుకు రవా ణా, ప్రజలకు అందడంలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బియ్యం కూడా పాఠశాలలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్, నేషనల్ ఇన్‌ఫర్‌మేటిక్ సెంటర్ డీఐఓ మోహన్‌కృష్ణ, ఒంగోలు ఆర్‌డీఓ ఎంఎస్ మురళి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top