ఆధార్ సీడింగ్‌లో లోపాలు

ఆధార్ సీడింగ్‌లో లోపాలు


రామచంద్రపురం :సర్వేల పేరుతో పింఛన్లు తొలగించడంతో లబ్ధిదారులు లబోదిబోమంటుంటే సర్వర్‌లో లోపాలతో మరి కొంత మందికి పింఛన్లు అందక పోస్టాఫీసులు, పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అసలు తమ పింఛన్లు ఉన్నాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ప్రతినెలా పోస్టాఫీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక పింఛన్లు అందిస్తున్నారు.

 

 వేలిముద్రలను ఆధార్‌తో అనుసంధానం చేసి బయోమెట్రిక్ మిషన్లు ద్వారా పింఛన్లు అందిస్తున్నారు. ఆధార్ అనుసంధానం కానివారికి లోకల్ సర్వర్ ద్వారా వేలిముద్రలు తీసుకుని పింఛన్ అందించే వారు. కానీ ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వే అనంతరం పింఛన్ల పెంపును అమలు చేశారు. దీంతో పాటు ఆధార్ సీడింగ్ సర్వర్‌ను మాత్రమే అందుబాటులో ఉంచారు. దీంతో లోకల్ సర్వర్ ద్వారా అనుసంధానం అయిన లబ్ధిదారులకు పింఛను నిలిచిపోయింది. ప్రభుత్వం పెంచిన పింఛన్ల జాబితాలో తమ పేర్లు ఉన్నా వారికి సొమ్ములు రావడం లేదు. పింఛను మంజూరు కావడంతో పోస్టాఫీసు వద్దకు వెళ్లేసరికి వేలిముద్రలు సరిపోవడం లేదంటూ సొమ్ము ఇవ్వడం లేదు.

 

 గతంలో పింఛనుదారుల వద్ద నుంచి తీసుకున్న వేలిముద్రలను కాకుండా ప్రస్తుత ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసందానం చేయడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవల సర్వే అనంతరం ఆధార్ సీడింగ్‌ను హడావుడిగా చేయడం వల్ల కొంతమంది పింఛనుదారుల ఆధార్ నంబర్లను తప్పుగా ఎంట్రీ చేయటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం సర్వర్‌లోని పింఛనుదారుల వేలిముద్రలు, ప్రస్తుత  వేలి ముద్రలు తేడాల వల్ల పింఛనురావడం లేదని మండల కోఆర్డినేటర్లు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 72 వేల పింఛన్లు నిలిచిపోయాయి. ఇప్పటికే జిల్లాలో వివిధ కారణాలతో 90,981 మందికి పింఛన్లు నిలిపివేశారు.ప్రస్తుతం లోకల్ సర్వర్ అనుసంధానం చేయకపోవటంతో మరికొంత మందికి పింఛన్లు ఆగిపోవటం పింఛన్‌దారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

 

 లోకర్ సర్వర్ ఓపెన్ కాక ఆధార్ లోపాలు, వేలిముద్రలు ఉన్నవారికి పింఛన్ రాకపోవడంతో అసలు తమకు పింఛన్ వస్తుందో రాదోనని వారు ఆందోళన పడుతున్నారు. గ్రామాల్లోను, మున్సిపాలిటీల్లోనూ జరగుతున్న గ్రామసభలకు వచ్చి తమ పింఛను మెషీన్లు నుంచి రాకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ప్రతి నెలా ఆధార్ సర్వర్‌తో పాటుగా లోకల్ సర్వర్‌ను కూడా అధికారులు ఓపెన్ చేసేవారు, కానీ ఈ నెలలో ప్రస్తుతం 20వ తేదీ దాటి పోతున్నా గ్రామ సభలు నిర్వహించలేదు. దీంతో పింఛన్లు అందక కొంత మందికి, సర్వర్‌లో లోపాలతో మరి కొంత మందికి ఈనెల పింఛన్ల తీసుకోవటం ఒక ప్రహసనంలా మారిందంటున్నారు. లోకల్ సర్వర్‌ను ఓపెన్ చేసి వీరికి పింఛన్లు అందేలా చూడాలని

 లబ్ధిదారులు కోరుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top