నేటితో ‘ఆధారం’ కట్!

నేటితో ‘ఆధారం’ కట్!

  •      ఆధార్ నమోదుకు ముగిసిన గడువు

  •      పాడేరులో డివిజన్‌లో తీవ్ర జాప్యం

  •      నమోదైతేనే రేషన్ : జేసీ

  • ఆధార్ ప్రక్రియ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. సంక్షేమ పథకాలతో ఆధార్ అనుసంధానానికి ఆదివారంతో గడువు ముగుస్తోంది. ఆధార్ లేని వారికి సోమవారం నుంచి సంక్షేమ ఫలాలు అందుతాయో? లేదోనని సర్వత్రా భయాందోళనలు నెలకొని ఉన్నాయి.

     

    విశాఖ రూరల్: జిల్లాలో శతశాతం ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నా.. ఇప్పటికీ వేల మంది ఆధార్ తీసుకోవాల్సి ఉంది. ప్రధానంగా పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆధార్ నమోదుకు జాప్యం జరుగుతోంది. దీంతో నగరం నుంచి 5 ఆధార్ కిట్లను పాడేరుకు పంపించారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ నమోదుకు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.

     

    రేషన్‌కార్డులతో ఆధార్ సీడింగ్ 74.07 శాతం



    జిల్లాలో మొత్తంగా 11,61,232 తెల్లరేషన్‌కార్డులు ఉన్నాయి. కుటుంబ సభ్యుల పరంగా చూస్తే 40,89,126 మంది ఉన్నారు. వీరిలో 74.04 శాతం మంది ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. 28,74,596 మంది తమ ఆధార్‌కార్డులను సమర్పించగా, 8,70,484 మంది ఇవ్వాల్సి ఉంది. ఆధార్ సమర్పించనివాటిని బోగస్‌కార్డులుగా గుర్తించాలని అధికారులు నిర్ణయించారు. ఆధార్ తో అనుసంధాన ప్రక్రియ ప్రారంభమైన తరువాత జిల్లాలో 14 టన్నుల బియ్యం నిల్వలు మిగిలాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. ఈ నెల 31 లోగా ఆధార్‌తో అనుసంధానం చేసుకోని వారికి రేషన్ సరుకుల సరఫరా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.

     

    గ్యాస్‌తో ఆధార్ అనుసంధానం 47.79 శాతమే : అదేవిధంగా ఈ నెల 31లోగా వినియోగదారుల నుంచి ఆధార్‌ను సేకరించాలని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 47.79 మంది వినియోగదారులు మాత్రమే ఆధార్‌కార్డులను సమర్పించారు.



    ఆధార్‌కార్డులు ఇవ్వని వారిని బోగస్‌లుగా గుర్తించి వారికి గ్యాస్ సరఫరా నిలిపివేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆధార్ నమోదుపై జేసీ రెవెన్యూ డివిజన్ల అధికారులు, తహశీల్దార్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

     

    ఆధార్ తప్పనిసరి : సంక్షేమ పథకాలు వర్తించాలంటే ఆధార్ తప్పనిసరి. ఆ మేరకు జిల్లాలో చర్యలు తీసుకుంటున్నాం. పాడేరులో మినహా మిగిలిన రెవెన్యూ డివిజన్లలో ఆధార్ అనుసంధానం వేగవంతంగా జరుగుతోంది. ఈ ఆధార్ ప్రక్రియ కారణంగా బోగస్‌లను ఏరివేసే అవకాశముంటుంది. ఎన్‌రోల్‌మెంట్ చేయించుకోని వారికి వచ్చే నెల నుంచి రేషన్ ఇవ్వడం జరగదు. ఆధార్ నమోదు చేసుకొని వస్తే సరుకులు ఇస్తాం.            

    - జేసీ

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top