ఆధార్‌ పడాల్సిందే

ఆధార్‌ పడాల్సిందే

  •  అన్ని పథకాలకు వర్తింపు

  •   జాడలేని నమోదు కేంద్రాలు

  •   ఆందోళనలో ప్రజానీకం

  • విజయవాడ :  ఆధార్ అవస్థలు తొలిగిపోయాయన్న సంబరం ప్రజలకు ఎంతో కాలం నిలవలేదు. మళ్లీ అన్ని పథకాలకు ఆధార్ వర్తింపజేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో మళ్లీ ఆధార్ పాట్లు మొదలయ్యాయని జనం ఆందోళన చెందుతున్నారు. విజయవాడలో ఆధార్ నమోదు కేంద్రాల జాడ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే నెల నుంచి వృద్ధాప్య పింఛను పొందడానికి తప్పనిసరిగా ఆధార్ నంబర్ ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అలాగే ఆగస్టు 15వ తేదీ నాటికి రేషన్ కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

     

    నమోదు కేంద్రాలేవీ..

     

    జిల్లాలో 45,17,398 మంది జనాభా ఉంటే 43,83,120 మంది ఆధార్ కార్డు కోసం ఐరిస్ తీయించుకున్నారు. మరో 1,34,278 మంది ఆధార్ దిగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ఆధార్ కేంద్రాలు బాగానే పనిచేశాయి. కానీ ఇప్పుడు ఎక్కడా కానరావడం లేదు. గ్యాస్ సబ్సిడీకి ఆధార్ తప్పనిసరి అని నిబంధన విధించడంతో ప్రజలు ఆధార్‌కు ఐరిస్ తీయించుకునేందుకు పరుగులు తీశారు. వారి నుంచి  ఒత్తిడి రావడంతో యూపీఏ సర్కారు గ్యాస్ సబ్సిడీకి ఆధార్ అక్కర్లేదని ఉత్తర్వులు ఇవ్వడంతో తీయించుకోనివారికి కాస్త ఊరట లభించింది.

     

    ఆధార్ ఉంటేనే పింఛను..

     

    వచ్చే నెల నుంచి ఆధార్ కార్డు ఉంటేనే పింఛను ఇస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పింఛనుదారులు 3,14,910 మంది ఉన్నారు. వీరిలో  2,50,749 మందికి ఆధార్ కార్డులున్నాయి. ఇంకా 64,161 మంది పింఛనుదారులకు ఆధార్ నంబర్లు లేవని అధికారులు గుర్తించారు. ఆధార్ లేని వారికి జూలై నెలలో పింఛను ఇస్తున్నా, ఆగస్టు నుంచి ఇవ్వబోమని సిబ్బంది చెబుతున్నారు. దీంతో పింఛనుదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆధార్ కేంద్రాల జాడ కోసం ఆరాతీస్తున్నారు.

     

    మళ్లీ గ్యాస్‌కు ఆధార్ లింకు..

     

    వంటగ్యాస్ సరఫరాకు కూడా ఆధార్ నంబరు తప్పనిసరి అనే నిబంధనలు రానున్నాయని చమురు కంపెనీల అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అన్ని కంపెనీలకు సంబంధించి 10,94,104 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 8,59,071 మంది ఆధార్ అనుసంధానం చేసుకున్నారు. ఇంకా  2,35,033 మంది గ్యాస్ వినియోగదారులకు ఆధార్ కార్డు లేదని అధికారులు గుర్తించారు. కొద్ది రోజుల్లో గ్యాస్ సరఫరాకు కూడా ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు.

     

    త్వరలో 35 శాశ్వత కేంద్రాలు..

     

    త్వరలో జిల్లా వ్యాప్తంగా 35 శాశ్వత ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి పి.బి.సంధ్యారాణి చెప్పారు. ఆధార్ లేని వారందరూ వెంటనే ఐరిస్ తీయించుకోవాలని పేర్కొన్నారు. గతంలో ఆధార్ దిగి కార్డులు రాని వారు దగ్గరలోని మీసేవ కేంద్రాలకు వెళ్లి కార్డులు తీసుకోవాలని చెప్పారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top